జీవన్‌దాన్‌వుడు | - | Sakshi
Sakshi News home page

జీవన్‌దాన్‌వుడు

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

నెల్లూరు (అర్బన్‌): జీవ.. తన జీవితాన్ని త్యాగం చేసి ‘జీవన్‌దాన్‌’వుడు అయ్యారు. కుటుంబానికి ఆదరువుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిడ్‌ డెడ్‌కు గురయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ బిడ్డ అవయవాలను మరికొందరికి దానం చేసి ధన్యజీవులయ్యారు. వివరాలు.. దర్గామిట్టలోని బ్రహ్మానందపురానికి చెందిన ఉలవపాటి వెంకటాద్రి, గీత దంపతులకు కుమారుడు జీవ (24)తో పాటు అంజలి, మరో కుమార్తె ఉన్నారు. హృద్రోగ సమస్యతో తండ్రి ఏ పనీ చేయలేక ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబాన్ని పోషించేందుకు కుమారుడితో పాటు కుమార్తెలు చిన్న వయస్సులోనే బాధ్యతలను తమ భుజాలపైకెత్తుకున్నారు. కారు డ్రైవర్‌గా జీవ.. వస్త్ర దుకాణాల్లో కుమార్తెలు పనిచేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉన్నారు.

విధి వక్రీకరించి..

ఆడుతూ.. పాడుతూ జీవితాన్ని ఆస్వాదించాల్సిన వయస్సులోనే కుటుంబభారాన్ని మోస్తున్న జీవను విధి వక్రీకరించింది. బైక్‌పై ఈ నెల పదిన వెళ్తుండగా, హఠాత్తుగా అడ్డం వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి పడిపోయారు. వైద్యం నిమిత్తం జీజీహెచ్‌కు.. ఆపై కిమ్స్‌ స్పెషాల్టీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో జీవ ఉన్నారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం చేశారు. 24 గంటల తర్వాతా అతని ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో జీవకు అన్ని రకాల పరీక్షలు చేయగా, బ్రెయి న్‌ డెడ్‌ అని తేలింది. ఆరు గంటల తర్వాత బయట్నుంచి వచ్చిన డాక్టర్లు సైతం పరీక్ష చేయగా, ఇదే అంశాన్ని నిర్ధారించారు. విషయాన్ని తల్లిదండ్రులకు ఆస్పత్రి యూనిట్‌ హెడ్‌ రోహిణి ప్రియలక్ష్మి, వైద్యులు శనివారం తెలిపారు. ఈ మాట విని తల్లి గీత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధుమిత్రుల కన్నీటి ఆర్తనాదాలు, రోదనలు మిన్నంటాయి.

మీ బిడ్డను మరికొందరిలో చూడండి..

అవయవాలను దానం చేస్తే మరో ఏడుగురు బతుకుతారని, వీరిలో మీ బిడ్డను చూసుకోమని, వారి గుండెల్లో మీ బిడ్డ ఎన్నటికీ బతికుంటారని, అవయవదానంపై కుటుంబసభ్యులకు రోహిణి ప్రియలక్ష్మి చెప్పారు. దీంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని కన్నీటి సుడుల నడుమ అవయవదానానికి వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు. దీంతో జీవన్‌దాన్‌ ట్రస్ట్‌కు ఆస్పత్రి యాజమాన్యం సమాచారమిచ్చింది.

గ్రీన్‌ చానల్‌లో తరలింపు

జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ సూచించిన మేరకు జీవకు ఆపరేషన్‌ చేసిన కిమ్స్‌ వైద్యులు రెండు ఊపిరితిత్తులను చైన్నెలోని అపోలో.. గుండెను తిరుపతిలోని పద్మావతి హార్ట్‌ హాస్పిటల్‌కు.. లివర్‌ను కర్నూలు ఆస్పత్రికి ప్రత్యేక బాక్సుల్లో భద్రపర్చి.. గ్రీన్‌ చానల్‌ను పోలీసులు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారు. దీంతో అత్యంత వేగంగా అంబులెన్స్‌ల ద్వారా అవయవాలను తీసుకెళ్లి ఆయా ఆస్పత్రుల్లోని రోగులకు అమర్చారు. రెండు నేత్రాలను నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. రెండు కిడ్నీలను కిమ్స్‌ ఆస్పత్రిలోని రోగులకు అమర్చారు.

వారిలో నా బిడ్డను చూసుకుంటా..

నా బిడ్డ బతకడని తెలుసుకొని కుమిలిపోయాను. అయితే మరో ఏడుగురికి జీవితాన్నిస్తుండటంతో అవయవాలను దానం చేస్తున్నాం. వీరిలో నా బిడ్డను చూసుకుంటా. – గీత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement