చిల్లకూరు: తీర ప్రాంతంలోని తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో మౌలిక వసతులను కల్పించే కాంట్రాక్ట్ సంస్థ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసన కార్యక్రమాలను రెండు రోజులుగా గ్రామస్తులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణం, ఇతర పనులకు వినియోగించే వాహనాలను శనివారం అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు గ్రామస్తులెవరూ వ్యతిరేకం కాదని, అయితే తమకు పరిహారమిచ్చాకే పనులను కొనసాగించాలంటూ కాంట్రాక్ట్ సంస్థతో పాటు రెవెన్యూ అధికారులకు పలుమార్లు తెలియజేశామన్నారు. సదరు సంస్థతో స్థానిక వీఆర్వో కుమ్మకై ్క తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో సుమారు 40 కుటుంబాలు నివసిస్తుంటే, 14 ఇళ్లను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. గ్రామానికి సమీపంలో ఉన్న గిరిజనుల ఇళ్లను పూర్తిగా తొలగించి, వారికి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పక్కా గృహాన్ని నిర్మించివ్వడంతో పాటు పూర్తి స్థాయిలో నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. వాహనాల రాకపోకలను దాదాపు రెండు గంటల పాటు అడ్డుకోవడంతో, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పి పునరుద్ధరించారు.
ఉద్యమ కార్యాచరణ కోసం
17న బొప్పరాజు రాక
నెల్లూరు(అర్బన్): ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు కూటమి ప్రభుత్వమిచ్చిన హామీలను అమలు చేసేలా ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు గానూ నెల్లూరుకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ నెల 17న రానున్నారని సంఘ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని ఏపీఆర్‌ఎస్‌ఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, పెండింగ్ బకాయిల విడుదల తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమించేందుకు అన్ని శాఖల్లోని ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కోరారు. సచివాలయ, ఆర్టీసీ, రెవెన్యూ, ఉపాధ్యాయ ఇలా అన్ని రంగాల్లోని ఉద్యోగులు తమ సమస్యలను బొప్పరాజుకు వివరించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఏపీ జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రసాద్, మహిళా జిల్లా జనరల్ సెక్రటరీ చెన్నమ్మ, ఫైర్ డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర, సిటీ జనరల్ సెక్రటరీ మాల్యాద్రి, ప్రధానోపాధ్యాయుల సంఘ నేత చెంచురామయ్య, గ్రామ / వార్డు సచివాలయ సంఘ నేత ఽఽథామస్, అవుట్‌సోర్సింగ్ కార్మిక సంఘ నేత జానీ తదితరులు పాల్గొన్నారు.


