కోవూరు: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం నెల్లూరులోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే దిశగా కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, బుచ్చిరెడ్డిపాళెం రూరల్ మండల అధ్యక్షుడు చెర్లో సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులకు
జూన్ 30 వరకు గడువు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి itiadmissions. ap. gov. in వెబ్‌సైట్‌లో వచ్చే నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ కె.శ్రీధర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి ఒరిజనల్ సర్టిఫికెట్లను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో జూలై 7వ తేదీలోపు ధ్రువీకరణ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ జరిగే తేదీలను జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తారన్నారు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్థానిక వెంకటేశ్వపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో సంప్రదించాలన్నారు.
117 పొగాకు బేళ్ల
విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 117 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 126 బేళ్లు రాగా 117 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. కిలోకు గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.205 లభించింది. సగటున రూ.229.81గా నమోదైంది. వేలంలో 7 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ అరుణ్
రిచర్డ్ బాధ్యతల స్వీకరణ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అరుణ్ రిచర్డ్ మంగళవారం స్థానిక కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్‌లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్‌గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృభాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. బాధ్యతలు స్వీకరించిన అరుణ్ రిచర్డ్‌ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి, పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్‌కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్‌కుమార్, పీఆర్‌ఓ ఆర్‌పీపీ కుమార్‌లు ఘనమైన స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 80,455 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 43,309 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


