నిమ్మ ధరలపై లారీల ‘సమ్మె’ట | - | Sakshi
Sakshi News home page

నిమ్మ ధరలపై లారీల ‘సమ్మె’ట

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

పొదలకూరు: ఎండల తీవ్రత నేపథ్యంలో డిమాండ్‌ ఉండే మే నెలలోనే నిమ్మకాయల ధరలు పతనం అవుతున్నాయి. రైతులు ఊహించని విధంగా రోజు రోజుకు కాయల ధరలు దిగజారుతున్నాయి. కాయల దిగుబడి పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి కాయల ఎగుమతులు పెరగడంతోపాటు ఢిల్లీలో లారీల సమ్మె సైరన్‌ మోగించడంతో ధరపై ప్రభావం పడింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.25 నుంచి రూ.75 కాయల అమ్ముడు పోవడమే గగనంగా మారింది. నిమ్మకాయల ఎగుమతులు ఈ సీజన్‌లో ఢిల్లీ మార్కెట్‌కే అధికంగా ఉంటాయి. ధరలను సైతం ఢిల్లీ మార్కెట్‌ వ్యాపారులే నిర్ణయిస్తుంటారు. ఈ నేపథ్యంలో బయట రాష్ట్రాల కాయలతోపాటు ఆ ప్రాంతంలో కాయల దిగుబడి కూడా బాగా పెరగడంతో జిల్లా మార్కెట్‌ నుంచి డిమాండ్‌ తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది.

లారీల సమ్మెకు సైరన్‌

ఢిల్లీలో లారీల యజమానులు సమ్మెకు పిలుపునిచ్చారు. అక్కడ టోల్‌ ట్యాక్స్‌ కింద లారీకు రూ.1,200 వసూలు చేస్తుండగా దాన్ని అమాంతం రూ.6 వేలకు పెంచిన నేపథ్యంలో లారీల యజమానులు ఈ నెల 21 నుంచి సమ్మె బాట పెట్టేందుకు పిలునిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడి కాయలను ఎగుమతి చేసే వ్యాపారులు సమ్మె నిర్వహిస్తే కాయలు మార్కెట్‌కు వెళ్లడం కష్టం అవుతుందంటున్నారు. ఎగుమతి చేసిన కాయలను ఢిల్లీ నుంచి బయట ప్రాంతాలకు తీసుకుని వెళ్లి అమ్ముకోవాల్సి వస్తుందని దీంతో కాయలు చెడిపోయి నష్టపోవాల్సిన పరిస్థితి తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామా ల నేపథ్యంలో కాయల ధరలు పతనం కాగా, ఇక్కడి ఎగుమతులను తగ్గించిన్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement