చేతిరాతపై ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

చేతిరాతపై ఉచిత శిక్షణ

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

నెల్లూరు(టౌన్‌): అచరిత్వ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు కేవీఆర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని కృష్ణచైతన్య జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు ఉచిత లూసిడా హ్యాండ్‌ రైటింగ్‌ (ఇంగ్లిష్‌) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మూడురోజులపాటు కొనసాగనుంది. ఫౌండేషన్‌ అధ్యక్షుడు పీజీడీ కృపాల్‌ మాట్లాడుతూ ఐదేళ్లుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో రాత నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో లూసిడా హ్యాండ్‌ రైటింగ్‌ మాస్టర్‌ ట్రైనర్లు రత్నశేఖర్‌, లక్ష్మణరాజు, శ్రీనివాసులు, పాల్‌ సుధాకర్‌, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక డంప్‌ చేసి విక్రయాలు

కలువాయి(సైదాపురం): మండలంలోని కుల్లూరు జాతీయ రహదారి సమీపంలో భారీగా అక్రమ ఇసుక డంపింగ్‌ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెన్నానది నుంచి వందలాది టిప్పర్లతో ఇసుకను తరలించి హైవే పక్కన నిల్వ చేసి అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం. ధనార్జనే లక్ష్యంగా కొంతమంది నాయకుల కనుసన్నల్లో ఈ తంతు జరుగుతోందని ఆరోపణలున్నాయి. రోజుకు వందల సంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తూ, రాత్రివేళల్లో పెద్దఎత్తున డంపింగ్‌ చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులకు ముడుపులు అందుతున్న కారణంగానే చర్యల్లేవని స్థానికులు విమర్శిస్తున్నారు.

కావలి కాలువలో

వ్యక్తి గల్లంతు

సంగం: మండలంలోని చెన్నవరప్పాడు వద్ద కావలి కాలువలో ఓ వ్యక్తి పడిపోయి గల్లంతైన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చెన్నవరప్పాడు చెందిన పి.మాల్యాద్రి మోటార్‌ మరమ్మతులు, కరెంట్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఓ రైతు మోటార్‌ను రిపేర్‌ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మాల్యాద్రి కాలు జారి కాలువలో పడిపోయాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. మాల్యాద్రికి భార్య, పిల్లలున్నారు.

చేపలు విక్రయించి

వెళ్తుండగా..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రాపూరు: రాపూరు – పెంచలకోన జాతీయ రహదారిలోని ఏపూరు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మినీలారీ మైదుకూరు వైపు నుంచి రాపూరుకు వస్తోంది. అదే సమయంలో రాపూరు వైపు నుంచి మోటార్‌బైక్‌పై గుండవోలు గ్రామానికి లక్ష్మయ్య (28) వెళ్తున్నాడు. వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని గుండవోలు గిరిజన కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను రాపూరులో చేపలు విక్రయించి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌

బుచ్చిరెడ్డిపాళెం: సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా తరచూ నేరాలకు పాల్పడుతున్న మండలంలోని చల్లాయపాళెం గ్రామానికి చెందిన రవిచంద్రబాబు అలియాస్‌ నానిపై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఎస్పీ అజిత ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. రవిచంద్రబాబు కొంతకాలంగా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడిపై ఇప్పటికే రౌడీషీట్‌ కూడా ఉంది. ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో పీడీ యాక్ట్‌ ప్రయోగించారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.75

సన్నవి : రూ.25

పండ్లు : రూ.10

Advertisement
 
Advertisement
Advertisement