చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అతిపెద్ద పోలీస్ డివిజన్ అయిన గూడూరులో పనిచేసేందుకు గతంలో వివిధ ప్రాంతాల వారు ఆసక్తి చూపేవారు. అయితే జిల్లాల విభజనతో నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డివిజన్ పరిధిలో గూడూరు ఒకటి, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లు, రూరల్, చిల్లకూరు, కోట మండలాల్లోని మూడు స్టేషన్లు మాత్రమే మిగిలాయి. దీంతో గూడూరులో ఒక డీఎస్పీ, రూరల్, చిల్లకూరు, కోట మండలాలకు ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఒకటి, రెండో పట్టణాలకు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతో కొనసాగుతోంది. ఐదు స్టేషన్లలో సుమారు 140 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ గీతాకుమారి బదిలీపై వెళ్లారు. ఇన్‌చార్జిగా డీటీసీ డీఎస్పీ గిరిధర్ ఉన్నారు. రెగ్యులర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు. పలువురు వచ్చేందుకు ప్రయత్నించారు. నాడు, నేడు పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని వెనుకడుగు వేస్తున్నారు. డివిజన్‌లో డీఎస్పీ స్థానం ఇంత కాలంగా ఖాళీగా ఉండడం ఇప్పటివరకు చూడలేదనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది.
పర్యవేక్షణ లేక..
రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడంతో డివిజన్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు. అలాగే పోలీస్‌స్టేషన్లపై పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి వారుగా తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. సీనియర్లుంటే తమ పనులకు అడ్డుగా ఉంటారని స్టేషన్ స్థాయి అధికారులు వారికి బయట పనులు అప్పగిస్తున్నారు. యువ కానిస్టేబుళ్లకు పెత్తనమిచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలను చెప్పుకొనేందుకై నా డివిజన్ స్థాయి అధికారి ఉంటే బాగుంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైనా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీల పేరుతో హడావుడి చేయడం తప్ప మిగిలిన సమయంలో ఎవరికి వారే యమునా తీరే అనేలా ఉంటున్నారు.
బదిలీ కోసం..
కింది స్థాయి వారిపై అధికారులు పెత్తనం చెలాయిస్తుండటంతో నాలుగు నుంచి ఐదేళ్లు పూర్తి చేసుకున్న పలువురు కానిస్టేబుళ్లు బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి అధికారులను కలిస్తే గూడూరు డివిజన్‌లోని కానిస్టేబుళ్లా.. తిరుపతి వారిని అడగండని సమాధానం ఇస్తున్నారు. దీంతో పలువురు తిరుపతికి వెళ్లి అధికారులను కలిస్తే జిల్లా మారింది కదా.. బదిలీల విషయం వారే చూసుకుంటారని అంటున్నారు. దీంతో కానిస్టేబుళ్లు తలలు పట్టుకుంటున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కాక మునుపే బదిలీ విషయం తెలిసిపోతే తమ పిల్లలకు అడ్మిషన్‌లు తీసుకునే వీలుంటుందని వాపోతున్నారు. కింది స్థాయి సిబ్బంది బదిలీలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
ఇక్కడ్నుంచి బదిలీ అయ్యేందుకు
పోలీసుల యత్నం
రెండు జిల్లాల
ఉన్నతాధికారుల నుంచి విముఖత
ఇక రెగ్యులర్ డీఎస్పీ నియామకం ఎప్పుడో..


