● డ్రగ్ కంట్రోలర్‌కు వినతిపత్రం అందజేత
నెల్లూరు(అర్బన్): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లాలో హోల్‌సేల్, రిటైల్ మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నట్లు జిల్లా కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్ తెలిపారు. మంగళవారం నగరంలోని పెద్దాస్పత్రి ఆవరణలో ఉన్న జిల్లా ఔషధ నియంత్రణ కార్యాలయంలో డ్రగ్ కంట్రోలర్ రమేష్‌రెడ్డికి అసోసియేషన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్‌ల పేరుతో వ్యాపారులను నష్టపరచడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో ఇంటి వద్దకే మందుల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌ఆర్ 220 నిబంధనను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్ల ఆ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. జిల్లాలోని 350 హోల్‌సేల్ దుకాణాలు, సుమారు 1,850 రిటైల్ మెడికల్ షాపులు సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు నరేంద్ర, అశోక్, ప్రసాద్, అజయ్ పాల్గొన్నారు.
అత్యవసర సేవల కోసం..
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 11 మెడికల్ షాపులను తెరిచి ఉంచుతున్నట్లు ప్రదీప్ తెలిపారు. మైపాడు గేటు, తడికల బజార్ సెంటర్ ప్రజల కోసం జేఎం మెడికల్స్, స్టోన్‌హౌస్‌పేటలో సాయిరేఖ, బోసుబొమ్మ సెంటర్‌లో రుక్మిణి, గాంధీబొమ్మ సెంటర్‌లో పవన్, దేవిరెడ్డి వారి వీధిలో రేఖ, మద్రాస్ బస్టాండ్‌లో ఈశ్వర్, రామలింగాపురంలో అజయ్, దర్గామిట్టలో సాయిరేఖ మెడికల్స్, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలో కీ ఫార్మసీ, వేదాయపాళెంలో శబరీష్ లైఫ్ ఫార్మసీ తెరిచి ఉంటాయన్నారు.


