నెల్లూరు(దర్గామిట్ట): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న తాగునీటి పనుల పురోగతిపై బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీటిని అందించేందుకు చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీపీడబ్ల్యూఎస్ తాగునీటి పథకాల మెయింటెనెన్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లా పరిషత్ నుంచి 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మంజూరైన వివిధ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి అప్పగించాలన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, పైపులైన్ల మరమ్మతులను వెంటనే చేయాలని ఆదేశించారు. మేనెల 15 లోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయభాస్కర్, ఈఈ రెడ్డయ్య, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


