సంగం: స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని అనూష మంగళవారం పాముకాటుకు గురైంది. వేకువజామున మరుగుదొడ్డికి వెళ్లి వస్తున్న క్రమంలో బాలికను విషపురుగు కాటేసింది. చీకటి కారణంగా పాముకాటుగా గుర్తించలేకపోయారు. బాలికను గురుకుల సిబ్బంది వెంటనే సంగంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు గాయాన్ని పరిశీలించి పాముకాటు అని నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనూష ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో గురుకుల పాఠశాలలో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


