కలిగిరి/ఉదయగిరి: ప్రమాదంలో తండ్రి పూర్తి గా కాలిపోయి మాంసం ముద్దలా మారి.. ఆయన వివరాల కోసం రెండు రోజులు నరకయాతన అనుభవించి.. అవశేషాలను ఇంటికి తీసుకొచ్చాక పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరైన ఆత్మకూరి రేష్మ పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. మార్కాపురం వద్ద సంభవించిన ప్రమాదంలో నాగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన ఆత్మకూరి చిన్నయ్య (45) మృతి చెందిన విషయం విదితమే. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి గుర్తించేందుకు సైతం వీల్లేకుండాపోయింది. ఆయనకు ఐదుగురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె అంజలి ఇటీవల ఇంటర్ పూర్తి చేయగా, రెండో కుమార్తె రేష్మ.. వింజమూరులో పదో తరగతి పరీక్షలను రాస్తోంది. తండ్రి అవశేషాలను చూసి పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. అంత దుఃఖంలోనూ వింజమూరులోని నేతాజీ హైస్కూల్లో సైన్స్ పరీక్షను రేష్మ రాసింది. ఆమెను ఉపాధ్యాయులు, స్థానికులు, తోటి విద్యార్థులు ఓదార్చారు.


