సోమశిల: అనారోగ్యంతో బాధపడుతూ సదరం సర్టి ఫికెట్ ఉండి కూడా పెన్షన్ మంజూరు కాక, ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న బాలుడి దీనస్థితిపై ఫిబ్రవరి 19న సాక్షి దినపత్రికలో ‘ఆదు కోండయ్యా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. అనంతసాగరం మండల పరిధిలోని పాతదేవరాయపల్లి గ్రామానికి చెందిన చిచ్చు సంతోష్ అనే బాలుడికి దివ్యాంగుల పింఛన్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం సంతోష్‌కు రూ.6 వేల పింఛన్‌ను ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ అందజేశారు. దీంతో సంతోష్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెన్షన్ మంజూరు చేసేలా సహాయపడిన సాక్షి పత్రికకు, సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పింఛన్ నగదు సంతోష్ వైద్య ఖర్చులకు సహాయపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ఇంజినీరింగ్ అసిస్టెంట్ శోభన్‌బాబు, డిజిటల్ అసిస్టెంట్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
వడ్డీ మాఫీ గడువు
పొడిగింపు
నెల్లూరు(బారకాసు): రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ అవకాశాన్ని ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థకు బకాయిలు ఉన్న ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను బకాయిలపై వడ్డీ రాయితీ పొందాలని సూచించారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు సిటీ: నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. సౌత్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో గుర్తుతెలియని 60–65 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి రైలు పట్టాలు దాటుతున్నారు. ఈ క్రమంలో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు తెలుపురంగు నిలువుగీత ఫుల్ హ్యాండ్ షర్ట్, బంగారు అంచు తెలుపురంగు పంచె ధరించి ఉన్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కార్ల ఢీ..
నలుగురికి గాయాలు
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై బుధవారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని నలుగురు గాయపడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నెల్లూరు వైపు నుంచి కడప వైపునకు వెళ్తున్న కారు, అలాగే యడవల్లి నుంచి కోవూరు వైపునకు వస్తున్న మరో కారు బుచ్చిరెడ్డిపాళెం వద్దకు రాగానే ఊహించని రీతిలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో రెండు కార్లలో మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరిలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


