అక్రమాల్లో ఆరితేరిన సోమిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

అక్రమాల్లో ఆరితేరిన సోమిరెడ్డి

Apr 2 2026 7:23 AM | Updated on Apr 2 2026 7:23 AM

ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి

వెంకటాచలం: అభివృద్ధి, సంక్షేమ పాలనే తమ లక్ష్యమని.. అయితే అవినీతి, అక్రమాల్లో ఆరితేరడం సోమిరెడ్డి నైజమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ మంగళంపాడు గిరిజన కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల సాత్విక గ్రావెల్‌ గుంతలో పడి గత నెల 29న మృతి చెందింది. ఈ క్రమంలో బాలిక కుటుంబాన్ని బుధవారం పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్‌ నలగర్ల దేవసేనమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో కాకాణి మాట్లాడారు. గ్రావెల్‌ గుంతలో పడి బాలిక మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డి ధనదాహంతో ఎక్కడ చూసినా తాటిచెట్టు లోతులో గ్రావెల్‌ గుంతలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. వీటిలో పడి చిన్నారులు మృత్యువాత పడుతున్నా, గ్రావెల్‌ తవ్వకాలను నిలపకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

సర్వేపల్లి కేంద్రంగా సర్వం దోపిడీ

సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డంపెట్టుకొని సోమిరెడ్డి సర్వం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పొదలకూరులో జరిగిన రెండు కార్యక్రమాల్లో వాస్తవాలను సోమిరెడ్డి అంగీకరించడం సంతోషకరమన్నారు. సోమిరెడ్డి తరహాలో అవినీతికి పాల్పడటం తనకు చేతకాదని తెలిపారు. టీడీపీ కొలువుదీరాక సోమిరెడ్డి చేసిన అవినీతి చిట్టా చాంతాడంత ఉందన్నారు. కాకుటూరు శివాలయ భూములు.. విరువూరు, సూరాయపాళెం రీచ్‌లలో రేయింబవళ్లు ఇసుకను అక్రమంగా తరలించి దోచుకోవడం.. లేఅవుట్ల యజమానులను బెదిరించి ముడుపులు తీసుకోవడం.. ఇలా ఎన్నో ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో పర్యటించినా, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే దర్శనమిస్తున్నాయని తెలిపారు. కూటమి పాలనలో చేసిన అభివృద్ధి పనులేంటో ధైర్యంగా చెప్పగలరానని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఎంత మేర అభివృద్ధి పనులు జరిగాయో ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్‌ కొణిదెన మోహన్‌నాయుడు, నేతలు కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, కనుపూరు మధుసూదన్‌రెడ్డి, మంచు వెంకటేశ్వర్లునాయుడు, నలగర్ల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement