● ఎమ్మెల్యే కాకర్లపై చంద్రబాబు ఫైర్
● ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం చివాట్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పనితీరు బాగాలేదని, మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని సీఎం చంద్రబాబు మందలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వింజమూరు పర్యటనలో భాగంగా బుధవారం నియోజకవర్గంలోని ముఖ్య టీడీపీ నేతలతో హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని కార్యకర్తల ముందే కుండబద్దలు కొట్టినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే ఉదయగిరి 171వ స్థానంలో ఉందన్నారు. 2024 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉదయగిరి మొదట్నుంచీ కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీకి బలమైన నియోజకవర్గమని, ఇక్కడి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉందని చెప్పినట్లుగా సమాచారం. పార్టీ ముఖ్య నేతలకు, ఎమ్మెల్యేకు మధ్య రోజులు గడుస్తున్న కొద్దీ దూరం పెరుగుతున్నట్లుగా తెలుస్తోందని, ఈ గ్యాప్‌ను వీలైనంత త్వరగా పూడ్చుకోవాలని సూచించినట్లుగా సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గంలో మహిళలకు రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉందని, మహిళా నేతలను తయారు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. పార్టీ ముఖ్యమని, నేతలు కాదని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎవరైనా అభ్యర్థిగా నిలబడే అవకాశముందన్నారు. మీ సొంత ప్రయోజనాల కోసం పార్టీని దెబ్బతీయొద్దని గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి సంబంధించి 1,300 మంది పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్న సమావేశంలో ఎమ్మెల్యే తీరును సీఎం తప్పుబడుతూ హెచ్చరించడంతో ఆ పార్టీ ముఖ్య నేతల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని అన్ని కులాల వారిని కలుపుకోవాలన్నారు.
రూ.10 వేల నుంచి
రూ.30 వేల వరకు వసూళ్లు
సీఎం వింజమూరు పర్యటన నేపథ్యంలో పత్రికా ప్రకటనలు, ఇతరత్రా ఖర్చుల కోసం ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు నియోజకవర్గ స్థాయిలో పార్టీ పదవులు పొందిన వారి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారని తమ్ముళ్లు బాహాటంగా చర్చించుకుంటున్నారు. రాజకీయ పదవులు పొందినప్పటికీ తాము ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పార్టీ ద్వారా పొందలేదని, అయినా తమ వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేయడంపై పార్టీకి చెందిన పెద్దల వద్ద వాపోయినట్లుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వెంగమాంబ అనే మహిళ ముఖ్య పార్టీ నేతల కార్యక్రమానికి వచ్చేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే పోలీసుల ద్వారా ఆమెను సమావేశ మందిరానికి రాకుండా అడ్డుకున్నట్లుగా టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమెను సమావే శానికి రానివ్వకుండా ఓ సీఐ, ఒక మహిళా ఎస్సై తమ ఆధీనంలో ఉంచుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వింజమూరులో చంద్రబాబు పర్యటనతో తన క్రేజ్ పెరుగుతుందని భావించిన కాకర్లకు కార్యకర్తల సమక్షంలోనే చివాట్లు పెట్టడంతో ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రత్యర్థి వర్గీయుల్లో ఆనందాన్ని నింపినట్లుగా ఆ పార్టీ కేడర్‌లో చర్చ సాగుతోంది.
నీ పద్ధతి మార్చుకో..
లేకుంటే సహించేది లేదు
సమావేశానికి బొల్లినేని డుమ్మా
ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకటరామారావు వింజమూరులో జరిగిన సీఎం సభకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో కాకర్ల సురేష్‌కు టీడీపీ టికెట్ ఇచ్చినప్పటి నుంచి బొల్లినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం సురేష్ విజయం సాధించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఘటనలూ లేకపోలేదు. ఈ క్రమంలో బొల్లినేని, కాకర్ల మధ్య మనస్పర్థలు తారస్థాయికి చేరడంతో సీఎం సమావేశానికి బొల్లినేని డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది.


