ప్రజలు నివ్వెరపోయేలా నారాయణ సంభాషణ
● ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు రూరల్: నెల్లూరులో శాంతిభద్రతలు క్షీణించేలా.. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో సంభాషణను విని ప్రజలందరూ నివ్వెరపోయారని వైఎస్సార్‌సీపీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్న రౌడీషీట్లను తొలగించి వారిని రోడ్డుపైకి వదిలిపెడతామని చెప్పడం చూసి జిల్లా ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు. నేడు నెల్లూరులో హత్యలు, పీకలు కోయడం, తలలు పగలగొట్టడం నిత్యకృత్యమయ్యాయని చెప్పారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, 24 గంటలు లభ్యమవుతున్న మద్యం కారణంగా రౌడీలకు అడ్డాగా మారితే మంత్రికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. టీడీపీలో చేరితే మీపై ఉన్న రౌడీషీట్లు ఎత్తివేస్తామని, కేసులను తొలగిస్తామని, మీ నాయకులు రౌడీషీటర్లను పిలిపించుకుని మాట్లాడుతుంటే ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా చూసి ఉంటామా ఒకసారి ఆలోచించాలన్నారు. జిల్లాలో హత్యలు, రౌడీయిజం పెరిగినట్లు సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పారని.. ఇవన్నీ గుర్తుంచుకుని లా అండ్ ఆర్డర్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే నెల్లూరు మరింత దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు.


