అధికారం చేతిలో రాజ్యాంగం చిత్తు కాగితమైంది. రాజ్యాంగం క
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఇక లేనట్టే. మేయర్ పీఠం వ్యవహారంలో అధికార పార్టీ నేతలు ‘రాజ్యాంగాన్ని’ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒక ఎస్టీ మహిళను మేయర్ పీఠంపై నుంచి దించేసేందుకు ‘తూట్లు పొడిస్తే’.. బీసీ నేతను ఇన్‌చార్జి మేయర్ పదవిలో కూర్చొబెట్టేందుకు ‘పట్టం’ కట్టారు. ఈ పీఠంపై కూర్చొనే అర్హత ఉన్న మరో ఎస్టీ మహిళ ఉన్నప్పటికీ.. అవకాశం కల్పించకుండా కాలయాపన చేయడం, ఇన్‌చార్జి మేయర్ తాత్కాలికమే అంటూనే.. ఆ పదవిలో కూర్చొన్న వెంటనే రూప్‌కుమార్ నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలను కలిసి బొకేలు అందజేసి కృతజ్ఞతలు తెలపడం, నెల్లూరు కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతానంటూ చెప్పడం చూస్తే.. ఇక మేయర్ ఎన్నిక ‘కలే’ అని రూఢీ అవుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన్నే కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాజీనామా వరకు వికృత రాజకీయాలు
నెల్లూరు మేయర్ పీఠం విషయంలో గిరిజన మహిళకు టీడీపీ అన్యాయం చేసింది. ఆ పార్టీ బీసీ నేత డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్‌ను ఈ పీఠంపై కూర్చొబెట్టేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇందులో నెగ్గేందుకు సామదాన దండోపాయాలు ప్రదర్శించారు. అధికారాన్ని ఉపయోగించి పోలీసులతో స్రవంతి, ఆమె అనుచరులను భయాందోళనకు గురిచేశారు. దీంతో చివరికి వేధింపులు తట్టుకోలేక మేయర్ స్రవంతి తనకు తానే రాజీనామా చేసేవరకు వికృత రాజకీయాలు కొనసాగించారు. అవిశ్వాసం నెగ్గితే.. వెంటనే ఎన్నిక జరిపి అర్హత ఉన్న మరో మహిళకు అవకాశం కల్పిస్తామంటూ కార్పొరేటర్లను భ్రమింపజేశారు. డిప్యూటీ మేయర్ తాత్కాలికంగా ఇన్‌చార్జి మేయర్‌గానే ఉంటారంటూ నమ్మించారు. తాజాగా ఆ ప్రక్రియ ము గిశాక.. ఎన్నిక నిర్వహించకుండా ఎస్టీ రిజర్వుడు స్థానమైన మేయర్ పీఠంపై రూప్‌కుమార్‌యాదవ్‌ను ఇన్‌చార్జి మేయర్‌గా కొనసాగిస్తున్నారు.
విశాఖలో అలా.. నెల్లూరులో ఇలా..
విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ అక్కడి మేయర్‌పై ఈ ఏడాది ఏప్రిల్ 19న నెల్లూరు తరహాలోనే అవిశ్వాసానికి తెర తీశారు. అయితే అవిశ్వాసం నెగ్గడంతో అదే నెల 28న మేయర్ ఎన్నిక నిర్వహించి కొత్త మేయర్‌ను ఎన్నుకున్నారు. అయితే నెల్లూరు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. కేవలం 11 నెలలే పదవీ కాలం ఉన్నా ఈ పీఠాన్ని తమ సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో అప్పటి మేయర్ స్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాసానికి సిద్ధపడ్డారు. తొలుత రూప్‌కుమార్‌యాదవ్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఇన్‌చార్జి మేయర్‌గా కొనసాగుతారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే వాస్తవానికి రూప్‌కుమార్‌ను ఆ పీఠంపై కూర్చొబెట్టడం మెజార్టీ కార్పొరేటర్లకు ఇష్టం లేదు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే సమాచారం ఉండడంతో పాటు కొందరు కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరడంతో అప్రమత్తమైన అధికార పార్టీ నేతలు అస్త్రశస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో అప్పటి మేయర్ స్రవంతి అవిశ్వాసానికి నాలుగు రోజుల ముందు 14వ తేదీనే రాజీనామా ప్రకటన చేయడంతో పరిణామాలు కొత్త మలుపు తిరిగింది. ఆగమేఘాల మీద రాజీనామాను ఆమోదించడం, ఆ వెంటనే రూప్‌కుమార్‌ను ఇన్‌చార్జి మేయర్‌గా నియమించడం జరిగిపోయాయి. అయితే విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ విషయంలో కేవలం పది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా చర్యలు తీసుకున్న పాలకులు.. నెల్లూరు విషయంలో రెండు వారాలు గడిచినా.. ఇంత వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మేయర్ ఎన్నిక ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని కనీసం ప్రతిపాదనలు కూడా పంపకపోవడం విశేషం.
కాలయాపన వెనుక కుతంత్రం
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్నిక ప్రక్రియ చేపట్టే అవకాశం లేదు. అదే విధంగా ఏ ప్రజాప్రతినిధి రాజీనామా చేసినా.. కాలం చేసినా.. ఆ స్థానంలో ఆరు నెలల్లో తిరిగి కొత్త ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే నెల్లూరు కార్పొరేషన్‌లో ప్రస్తుత కౌన్సిల్ పదవీ కాలం 11 నెలలే ఉంది. నోటిఫికేషన్ జారీ చేయించకుండా.. మరికొంత కాలం కాలయాపన చేస్తే.. కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ జరిగే అవకాశం ఉండడని, చివరి పూర్తి కాలం రూప్‌కుమార్ ఇన్‌చార్జి మేయర్‌గా కొనసాగుతారని రాజకీయ కుతంత్రానికి తెరతీశారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తు న్న నెల్లూరులోనే ఎస్టీ మహిళకు అన్యాయం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్టీ మహిళ పీఠంపై
బీసీ నేతకు పట్టం
డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌కు
ఇన్‌చార్జి మేయర్ బాధ్యతలు
పదవీకాలం పూర్తయ్యే వరకు
ఆయనే కొనసాగింపు?
మరో ఎస్టీ మహిళ ఉన్నప్పటికీ
ఎన్నిక నిర్వహణపై మీనమేషాలు
విశాఖపట్నం కార్పొరేషన్‌లో
అవిశ్వాసం నెగ్గిన పది రోజుల్లోనే
తిరిగి ఎన్నిక నిర్వహణ
నెల్లూరులో అవిశ్వాసానికి ముందే మేయర్ రాజీనామా ప్రకటన
17 రోజులు దాటినా ఆ ఊసే లేదు
అధికారం చేతిలో రాజ్యాంగం చిత్తు కాగితమైంది. రాజ్యాంగం క


