ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి
● కలెక్టరేట్ ఎదుట పలు పార్టీల నిరసన
నెల్లూరు(దర్గామిట్ట): కొడవలూరు మండలం రాచ ర్లపాడులో ఇఫ్కో కిసాన్ సెజ్‌లో నిర్మించనున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా వివిధ పార్టీల నేతలు నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. కాలుష్యకారక పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రా లు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ కిసాన్ సెజ్‌లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. వివిధ జబ్బులు వస్తాయన్నారు. పలు రాష్ట్రాల్లో వద్దని వెనక్కు పంపించిన పరిశ్రమను పంటలు పండే భూమిలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. కిసాన్ సెజ్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను మాత్రమే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్న తరుణంలో వామపక్ష నాయకుల కదలికలను పరిశీలిస్తూ అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్రలు పన్నడం తగదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు వామపక్ష పార్టీలు వ్యతిరేకం కాదన్నారు. జనావాసాల మధ్యన కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. మంగళవారం రాచర్లపాడులో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అన్ని వామపక్ష పార్టీలు పాల్గొని నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించనున్నాయని తెలిపారు. పోలీసులు ఎన్ని కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాలుష్యకారక ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎంఎల్ నాయకులు సాగర్, రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నేత సుధీర్, సంజయ్‌కుమార్ తమ పార్టీల తరఫున వినతిపత్రాలు అందజేశారు. వామపక్ష నేతలు నందిపోగు రమణయ్య, సిరాజ్, జిలానీఖాన్, లీలామోహన్, అహ్మద్, మోహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నోటీసులు ఇవ్వడం దారుణం
నెల్లూరు(దర్గామిట్ట): కొడవలూరు మండలం రాచర్లపాడు కిసాన్ సెజ్‌లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పా టుపై మంగళవారం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయసేకరణకు హాజరుకాకూడదంటూ ఆర్ శ్రీనివాసులతో పాటు 25 మందికి నోటీసులు ఇవ్వడం దారుణమని పలువురు ప్రముఖులు, వైద్యులు ఖండించారు. సోమవారం వారు జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బంది లేకుంటే ప్రజాభిప్రాయసేకరణకు హాజరుకావద్దని ఎందుకు నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణలో పౌరులందరికీ భాగస్వామ్యం ఉందని, ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకాకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు చట్ట విరుద్ధమన్నారు. గతంలో నాలుగు వేల మంది ప్రజలు సమావేశమై ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకత చూపారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్లు కే బాబురావు, కే వెంకటరెడ్డి, డీ రాంబాబు, అహ్మద్‌ఖాన్, పీజీరావు, ఎం బాపూజీ పాల్గొన్నారు.


