అడ్వెంచర్ శిక్షణకు నెల్లూరు విద్యార్థులు
నెల్లూరు (టౌన్): రాష్ట్ర స్థాయి అడ్వెంచర్ శిక్షణకు జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కార్యక్రమానికి సంబంధించి ఒంగోలులోని ఏబీఎం కాంపౌండ్‌లో జోనల్ స్థాయి అడ్వెంచర్ స్పోర్ట్స్ సెలక్షన్‌ను సోమవారం నిర్వహించారు. అందులో ప్రతిభకనబర్చిన 9 మంది విద్యార్థులను గండిపేటలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శిక్షణకు ఎంపిక చేశారు. వీరిలో నెల్లూరు జిల్లా షేక్ అప్సర్(తిమ్మారెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్), గుణ్ణం ప్రతీక్( అన్నారెడ్డిపాళెం జెడ్పీ హెచ్‌ఎస్), ఎస్ నాగిరెడ్డి (చేజర్ల జెడ్పీహెచ్‌ఎస్) ఉన్నారు. వీరిని డీఈఓ బాలాజీరావు, ఏపీసీ వెంకటసుబ్బయ్య అభినందించారు.
విమానాశ్రయ భూసేకరణ
నివేదికకు కేబినెట్ ఆమోదం
నెల్లూరు (దర్గామిట్ట): దగదర్తి విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ సమగ్ర నివేదికను కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమ వారం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యాచరణ, భూసేకరణ పురోగతి నివేదికను కేబినెట్ ఆమోదించింది. దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
కౌన్సిల్ సర్వసభ్య
సమావేశం రేపు
నెల్లూరు(బారకాసు): నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. ఇన్‌చార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో 118 అంశాలతో కూడిన అజెండాతో పాటు 53 సప్లిమెంటరీ అంశాలను పొందుపరిచిన మరో అజెండాను ప్రవేశ పెట్టనున్నారు. టేబుల్ అజెండాను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
ముఫ్తీ అబ్దుల్ వహాబ్‌సాహెబ్ మరణం తీరని లోటు
నెల్లూరు(బృందావనం): నెల్లూరు మదరసా జామి యా నూరుల్ హుదా అరబిక్ కళాశాల వ్యవస్థాపక అధ్యాపకుడు జిల్లాలో తొలి ముఫ్తీగా గుర్తింపు పొందిన మత పెద్ద హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహబ్ సాహెబ్ ఖాసిమీ రషాది మరణం సమాజానికి తీరనిలోటని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజం, నెల్లూరు మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్‌అహ్మద్ పేర్కొన్నారు. నగరంలోని మూలాపేటలోని మదరసా జామియా నూర్ ఉల్ హుదాలో సోమవారం నిర్వహించిన జనాజా నమాజ్, అంత్యక్రియల్లో వారు పాల్గొన్నారు. అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అల్లాను ప్రార్ధించారు. కాగా అంత్యక్రియల్లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అడ్వెంచర్ శిక్షణకు నెల్లూరు విద్యార్థులు
అడ్వెంచర్ శిక్షణకు నెల్లూరు విద్యార్థులు


