పులి సంచారంపై గుబులు
● ఉదయగిరిలో మరోసారి కలకలం
ఉదయగిరి: స్థానిక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి అలజడి శనివారం మరోసారి వెలుగులోకి వచ్చింది. మేకల మేత నిమిత్తం గ్రామ సమీపంలోని బత్తల వెంకటమ్మగుంట, జెర్రివాగు ప్రాంతంలోని అడవికి జీ చెరువుపల్లికి చెందిన జీవాలకాపరి పెంచలయ్య ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో అతి సమీపంలో పులి గాండ్రింపులు వినిపించడంతో భయంతో వణికిపోయారు. అదే సమయంలో అడవిలో అవుల మంద పరిగెత్తడాన్ని గమనించారు. సుమారు 70కుపైగా అడవి ఆవుల మందను వేటాడుతున్నట్లు గుర్తించి గ్రామంలోకి వచ్చారు. ఆపై విషయాన్ని స్థానికులకు తెలిపి వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో ఘటన స్థలానికి సిబ్బంది వెళ్లి పులి సంచార గమనాన్ని గుర్తించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. కొత్తపల్లి బీట్ ప్రాంతంలో పులి పాదముద్రలను సిబ్బంది సాయంత్రం గుర్తించారని సమాచారం.
అటవీ అధికారుల నిర్లక్ష్యం
శ్రీశైలం టైగర్ జోన్ నుంచి ెగిద్దలూరు, వీ బైలు, భైరవకోన, దేవమ్మ చెరువు, కొత్తపల్లి, వెంకటాపురం ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం ఉందని నాలుగు నెలల క్రితమే పశువుల కాపర్లు గమనించి అటవీ సిబ్బందికి తెలిపారు. దీంతో వీటి కదలికలను ఉదయగిరి, ఆత్మకూరు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినా విషయాన్ని గోప్యంగా ఉంచారు. వెంకటాపురం జాతీయ రహదారి వద్ద కారును పెద్ద పులి ఢీకొని గతంలో గాయపడింది. ఇదే విషయాన్ని కారు డ్రైవర్ తెలిపినా పట్టించుకోలేదు. ఉదయగిరి రేంజ్ పరిఽధిలో పెద్ద పులి సంచారం ఉందని అటవీ అధికారులకు సైతం సమాచారముందని తెలుస్తోంది. బండగానిపల్లి ఘాట్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తులకు పులి కంటపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


