ఇసుక మాఫియాకు రోడ్లు బలి
● వంతెనల వద్ద ఏర్పడిన భారీ రంధ్రాలు
● టీడీపీ నాయకుల అండతో రెచ్చిపోతున్న వైనం
జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపు
లేకుండా పోతోంది. టీడీపీ నేతల అండదండలతో
పరిమితికి మించి టన్నుల కొద్దీ ఇసుకను తరలిస్తుండడంతో రోడ్లు గుల్లగుల్ల అవుతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక ట్రక్కుల వల్ల వంతెనల వద్ద భారీ రంధ్రాలు ఏర్పడి రోజుల తరబడి రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు.
ఆత్మకూరు: పట్టణానికి సమీపంలోని అప్పారావుపాళెం ఇసుక రీచ్ వద్ద నుంచి భారీ వాహనాలు పట్టణం మీదుగా వస్తుండడంతో ఆ మార్గంలోని పారుదల కాలువలపై నిర్మించిన పాత వంతెనలు కుంగి రంధ్రాలు పడుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో అప్పారావుపాళెం సమీపంలోని కొత్తపాళెం మలుపు వద్ద, నల్లపరెడ్డిపల్లి అడ్డరోడ్డు వద్ద, ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని వెంకయ్య స్వామి గుడి వద్ద పారుదల కాలువల బ్రిడ్జిలు దెబ్బతిని అడుగు మేరకుపైగా రంధ్రాలు ఏర్పడ్డాయి. కేవలం భారీ ఇసుక టిప్పర్లు ఈ మార్గంలో ఇష్టారాజ్యంగా ప్రయాణిస్తుండడంతో రోడ్లు దెబ్బతిన్నాయని స్థానికులు మండిపడుతున్నారు. కొత్తపాళెం, నల్లపరెడ్డిపల్లి మలుపు వద్ద గుంతలు పడి మూడు వారాలైనా ఇప్పటి వరకు అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడం గమనార్హం. దీంతో స్థానికులే సూచికలుగా ఆ గుంతల వద్ద కర్రలు నిలబెట్టారు. దీంతో ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ఆ ప్రాంతాల్లో భయాందోళనలకు గురవుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
పరిమితికి మించి..
అప్పారావుపాళెం ఇసుక రీచ్ నుంచి పరిమితికి మించిన భారీ వాహనాలు ఇసుకను తరలిస్తున్నాయి. ఒక్కొక్క టిప్పర్ 30 నుంచి 50 టన్నుల బరువు కలిగిన ఇసుక తరలిస్తూ నిత్యం పదుల కొద్దీ ఈ మార్గంలో ప్రయాణిస్తుండడంతో దశాబ్దాల క్రితం పంట కాలువలపై ఏర్పాటు చేసిన బ్రిడ్జిలు దెబ్బతింటున్నాయి. కేవలం కూటమి నాయకుల స్వలాభమే ధ్యేయంగా ఇసుకను తరలించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.
నిలిచిన ఆర్టీసీ బస్సు
ఆత్మకూరు–అప్పారావుపాళెం మార్గంలో భారీ గుంతలు పడడంతో చేజర్ల బస్సును ఆర్టీసీ అధికారులు వారం రోజులుగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఇసుక లారీలు, ట్రాక్టర్లకు కూడా అనుమతిని నిలిపివేశారు. కేవలం ఆటోలు, ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణాలు సాగిస్తున్నాయి.
ప్రయాణాలకు ఇబ్బందులు
ఈ మార్గంలో ఆర్టీసీ బస్సును నిలిపివేయడంతో అప్పారావుపాళెం, బట్టేపాడు హైస్కూళ్లలో చదువుకునే సమీప గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు నిలిచిపోవడంతో ఆటోలు మాత్రమే ప్రయాణిస్తుండడంతో ఆటోల కోసం ఎదురుచూస్తూ పాఠశాల సమయం మించిపోతుండడంతో విద్యార్థులు సరైన సమయంలో బడికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రహదారులు, భవనాల శాఖ అధికారులు రంధ్రాలు పడిన బ్రిడ్జిలకు మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని, అదే క్రమంలో భారీ ఇసుక వాహనాలను ఈ మార్గంలో అనుమతించరాదని ప్రజలు కోరుతున్నారు.
ఇసుక మాఫియాకు రోడ్లు బలి
ఇసుక మాఫియాకు రోడ్లు బలి


