ప్రజారోగ్య పరిరక్షణలో పీఎంపీలు కీలకం
నెల్లూరు(అర్బన్): వైద్యశాఖతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో పీఎంపీ వైద్యులు కీలకపాత్ర పోషిస్తున్నారని, వారి కృషి అభినందనీయమని డీఎంహెచ్‌ఓ సుజాత అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ఏనుగు సుందర్రామిరెడ్డి రోటరీ క్లబ్ ఆడిటోరియంలో 63వ పీఎంపీ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మారుమూల పల్లెలతో పాటు, పట్టణాల్లోని పేదలతో మమేకమై అతి తక్కువ ఖర్చుతో పీఎంపీలు వైద్య సేవలందిస్తున్నారన్నారు. డాక్టర్ శార్వాణి కంటి వ్యాధులు, నివారణపై అవగాహన కల్పించారు. కిడ్నీ దానంపై సురేంద్రకుమార్ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. మెదడు, నరాల సమస్యలపై డాక్టర్ వైష్ణవి, కీళ్లు, ఎముకల వ్యాధులపై డాక్టర్ భాస్కర్, సర్జరీలపై లాపరోస్కోపిక్ సర్జన్ అమర్‌నాథరెడ్డి, చిన్నపిల్లల వ్యాధులపై రాజశేఖర్‌రెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధులపై ప్రేమ్‌దీప్, చర్మవ్యాధులపై శ్వేత, సీ్త్రల సమస్యలపై విజయలక్ష్మి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీఎంపీలకు అవగాహన కల్పించారు. నారాయణ మెడికల్ గ్రూప్ ఏజీఎం చౌకచర్ల భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా పీఎంపీలతో కలిసి వైద్య సదస్సులు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం భాస్కర్‌రెడ్డిని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ సత్కరించారు. జిల్లా లెప్రసీ, టీబీ నివారణాధికారి ఖాదర్‌వలీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కనకాద్రి, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జయప్రకాష్, న్యాయ సలహాదారు రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, ప్రసాద్, రామదాస్, మాలిని, రమణయ్య, మస్తానయ్య, వెంకటేశ్వర్లు, శేఖర్, సాయిమురళి, సుమారు 300 మంది పీఎంపీలు పాల్గొన్నారు.


