ఉద్యోగాలివ్వండి.. లేకుంటే తిండి పెట్టండి
● జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదీ కాకపోతే తిండైనా పెట్టాలని ఏఐవైఎఫ్ జిలా కార్యదర్శి మున్నా డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి ఇస్తామని, ఉద్యోగావకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా చంద్రబాబు ఒక్కరికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. నేడు రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు లేకపోవడంతో గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గౌస్‌బాషా, బాబయ్య, నూరుల్లా, మీరామొహిద్దీన్, షబ్బీర్, ఖాజా, మనోహర్, వాసుదేవరెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


