వెంటనే మరమ్మతులు చేపట్టాలి
● వైఎస్సార్‌సీపీ నేతల నిరసన
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని చేజర్ల మార్గంలో వెంకయ్యస్వామి గుడి సమీపంలో ఉన్న పంటకాలువ బ్రిడ్జికి రంధ్రంపడి వారం రోజులైనా ప్రభుత్వాధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. పార్టీ ఎస్సీసెల్ నాయకుడు తోడేటి అశోక్ ఆధ్వర్యంలో పలువురు రోడ్డుకు గుంతపడిన ప్రాంతంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. కొందరు గుంతలోకి దిగి పరిశీలించి పెను ప్రమాదాలు చోటు చేసుకుంటాయని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు దుయ్యబట్టారు. ఈ మార్గంలో బస్సును సైతం వారం రోజులుగా నిలిపివేయడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇసుక తరలించే భారీ వాహనాలు ఈ మార్గంలో అనుమతించరాదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, మాల్యాద్రి, దొరబాబు, రాజా, వెంకయ్య, సుమంత్, మాధవ, పెంచలయ్య, బుజ్జయ్య తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.


