అధికారం ఉంది.. మా ఇష్టం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం ఉందని కొందరు కూటమి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆక్వా కల్చర్ సాగుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వారంరోజులుగా రొయ్యల గుంతల నిర్మాణాన్ని చేపట్టారు. 13 భారీ యంత్రాలను ఉపయోగించి వంద ఎకరాల్లో గుంతల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారని తీరప్రాంత గ్రామస్తులు భయపడుతున్నారు. సీఆర్‌జెడ్ (కోస్టల్ రెగ్యులర్ జోన్) నిబంధనలను తుంగలో తొక్కి పెద్దఎత్తున ప్రభుత్వ భూముల్లో ఆక్వా కల్చర్‌కు సిద్ధమయ్యారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం తీరప్రాంత గ్రామానికి సమీపంలో ఈ తంతు జరుగుతున్నా ఆపేవారు లేరు.
పట్టించుకోకుండా..
కృష్ణపట్నం గ్రామ సచివాలయానికి 4.5 కి.మీ దూరంలోనే అక్రమంగా ఆక్వా గుంతల నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ భూముల్లో వివిధ రకాల పంటల సాగు చేసుకుని జీవిస్తున్నారు. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకున్న కొందరు ఇక్కడ రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టారు. పేదల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములకు ఎంతో కొంత ముట్టజెప్పి స్వాధీనం చేసుకుని పెద్ద ఎత్తున గుంతలను తవ్విస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బాగా ఎత్తులో మట్టికట్టలను నిర్మించి గుంతలను తయారు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వారించేందుకు వెళ్లి అధికార బలం ముందు ఏమి చేయలేక నిలిపివేయాల్సిందిగా మౌఖిక ఆదేశాలు మాత్రం అందజేసినట్టు తెలుస్తోంది.
చర్యలు తీసుకోవాలి
సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీరానికి 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. తీరప్రాంతాల పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా చేయబడింది. అయితే సీఆర్‌జెడ్ నిబంధనలను తొంగలో తొక్కి యథేచ్ఛగా 100 మీటర్ల లోపలే రొయ్యల సాగు కోసం గుంతలను నిర్మిస్తున్నారు. ఇక్కడ బయటి ప్రాంతం నుంచి వచ్చి పట్టపగలే పనులు చేయిస్తున్నారంటే స్థానికంగా ఎవరి అండదండలు ఉన్నాయనేది పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అధికార పార్టీ నాయకులు తెరవెనుక ఉండి నడుపుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇకనైనా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ భూమిలో
అక్రమంగా ఆక్వా కల్చర్
చెలరేగిపోతున్న నాయకులు
సముద్ర తీరంలో భారీ యంత్రాలతో గుంతలు
అధికారుల హెచ్చరికలు బేఖాతరు
సీఆర్‌జెడ్ నిబంధనలకు తూట్లు
అధికారం ఉంది.. మా ఇష్టం


