అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు
● నెల్లూరు ఎంఎల్‌ఎ్‌స్ పాయింట్‌లో
ఇదీ పరిస్థితి
● బియ్యం అక్రమ రవాణా కోసమేనా..
● పని చేయకుండా చేశారని ఆరోపణలు
నెల్లూరు ఎంఎల్‌ఎస్ పాయింట్
నెల్లూరు(పొగతోట): ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారు. బియ్యం అక్రమ రవాణా చేయలేమని, గుట్టు రట్టువుతుందని ఈ పనికి పూనుకున్నట్లు ఆరోపణలున్నాయి. నెలలుగా కెమెరాలు పని చేయకపోయినా పట్టించుకున్న నాథుడు లేడు. మరమ్మతులు చేయించే విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది.
నిబంధనలు తుంగలో తొక్కి..
జిల్లాలో 1,513 చౌక దుకాణాలున్నాయి. 7.20 లక్షల రేషన్ కార్డుదారులున్నారు. ప్రతినెలా 10 వేల నుంచి 11 వేల టన్నుల బియ్యం పది ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా చౌకదుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వాటిల్లో ఇన్‌చార్జిలుగా డిప్యూటీ తహసీల్దార్, లేదా సీనియర్ అసిస్టెంట్ హోదా కలిగిన అధికారులను నియమించాలి. కానీ కొంత కాలంగా మూడు పాయింట్లకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇన్‌చార్జిలుగా నియమించారు. మరో మూడుచోట్ల సీసీఎస్ డీటీలను వేశారు. కానీ ఇలా చేయకూడదు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
ఇక్కడిలా..
నెల్లూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ జిల్లాలో ప్రాధానమైనది. ఇక్కడి నుంచి సుమారు 230 చౌక దుకాణాలకు ప్రతినెలా రేషన్ సరఫరా చేస్తున్నారు. అటువంటి కీలకమైన చోట అనేక నెలలుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుగా ఉన్నాయని సిబ్బంది అవి పనిచేయకుండా చేశారని ఆరోపణలున్నాయి. ఫలితంగా కొంత కాలంగా ప్రైవేట్ వ్యక్తులు వాహనాల్లో బియ్యం అక్రమ రవాణాను కొనసాగించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి ఈ విషయాన్ని గమనించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మరమ్మతులు చేయిస్తాం
నెల్లూరు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని నా దృష్టికి వచ్చింది. మరమ్మతులు చేయిస్తాం. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తప్పకుండా కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడతాం. పాయింట్‌లో ప్రైవేట్ వ్యక్తులు, వాహనాలు వచ్చినట్లు రుజువైతే దానికి సంబంఽధించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఎం.వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్
అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు


