పని దొరకడం లేదని..
● కత్తితో మెడ కోసుకున్న వ్యక్తి
● నెల్లూరు నగరంలో ఘటన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పట్టపగలు ఓ వ్యక్తి కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన నెల్లూరులోని కనకమహాల్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మంగళగిరి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన 41 సంవత్సరాల వయసున్న అమీర్‌వలీ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో పనుల కోసం కొద్దిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరక్కపోవడంతో మానసికంగా ఆందోళనకు గురైన అతను గురువారం ఉదయం కనకమహాల్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డుపై చేరి చిన్న కత్తితో తన మెడ, పొట్ట భాగాల్లో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమీర్‌వలీని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.
కోడిపందేల
స్థావరాలపై దాడులు
సైదాపురం: మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామ శివారు ప్రాంతాల్లో గురువారం కోడిపందేల స్థావరాలపై ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రూ.3,320 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
భార్యను కిడ్నాప్
చేశారని ఫిర్యాదు
సైదాపురం: తనపై దాడి చేసి భార్యను ఆమె బంధువులు కిడ్నాప్ చేశారంటూ మండలంలోని అనంతమడుగు గ్రామ పంచాయతీ కుంటిరాజుపాళెం గ్రామానికి చెందిన మందపాటి శివశంకర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. శివశంకర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కందుకూరుకు చెందిన మైత్రి అనే యువతి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగాన్వేషణలో ఉంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈనెల 15వ తేదీన అక్కడే రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అక్కడ్నుంచి కుంటిరాజుపాళెం గ్రామానికి వచ్చారు. కాగా యువతి తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో రెండు రోజుల క్రితం రాపూరు పోలీస్‌స్టేషన్‌లో ఇరు కుటుంబాలకు చెందిన వారి సమక్షంలో రాజీ కూడా చేసి పంపేశారు. గురువారం సెలవు దినం కావడంతో శివశంకర్ భార్యతో కలిసి స్వగ్రామం నుంచి మోటార్‌బైక్‌పై గూడూరుకు వెళ్తున్నాడు. మైత్రి బంధువులు కర్రలతో శివశంకర్‌పై దాడి చేశారు. తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


