దందా లోగుట్టు.. పెరుమాళ్లకెరుక
ఉదయగిరి పౌరసరఫరాల గోదాములో సరుకులు మాయమైన ఉదంతం జిల్లాలో చర్చనీయాంశమైంది. బియ్యం, చక్కెర, కందిపప్పు కొద్ది నెలలుగా స్వాహా అవుతున్నా, తనిఖీల్లో అధికారులెందుకు గుర్తించలేకపోయారాననేదే అసలు ప్రశ్న. ఒక వేళ కనుగొన్నా, ఎందుకు బయటపెట్టలేదనేదీ అంతుచిక్కడంలేదు. పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాక జిల్లా, రాష్ట్రాధికారుల బృందాలు హడావుడిగా తనిఖీలు జరిపి ఇదే అంశాన్ని నిర్ధారించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఉదయగిరి: టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతోంది. జలదంకి, కడపకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల అనుచరులు ఉదయగిరి ప్రాంతం నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించే హక్కును పొందారనే ప్రచారం ఉంది. వీరికి సంబంధించిన వాహనాలూ పట్టుబడ్డాయి.
మారిన పంథా
రేషన్ కార్డుల లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని డీలర్లు గతంలో సేకరించేవారు. ఆపై వీరి నుంచి వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ దందాలో నూతన పోకడలను అవలంబిస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి సివిల్ సప్లయ్స్ గోదాముల నుంచే బియ్యాన్ని వ్యాపారులు అక్రమంగా రవాణా చేసే సంస్కృతికి తెరలేపారు. ఈ క్రమంలోనే స్థానిక గోదాము నుంచి బియ్యాన్ని స్వాహా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దల ప్రమేయం..?
ఉదయగిరి సివిల్ సప్లయ్స్ గోదాములో సరుకుల స్వాహా వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉందనే ప్రచారం గుప్పుమంటోంది. బియ్యం, చక్కెర, కందిపప్పు, ఇతర సరుకుల మాయం వెనుక స్థానిక ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌లో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉందని పౌరసరఫరాల అధికారులు తేల్చారు. దీనిపై సివిల్ సప్లయ్స్ జిల్లా డీఎం అర్జున్‌రావు ఉదయగిరి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అయితే ఈ ఉదంతం వెనుక ఉన్నతాధికారులు, రాజకీయ నేతల హస్తం సైతం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణలో నిజాలు నిగ్గు తేలేనా..?
జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం ఫిర్యాదు మేరకు ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌లో విధులు నిర్వర్తించే ముగ్గురిపై విచారణ సీఐ వెంకట్రావు పర్యవేక్షణలో జరుగుతోంది. బియ్యం స్వాహా వెనుక ఎవరెవరి పాత్ర ఉందనే నిజాలూ తెలిసే అవకాశం ఉంది. నిష్పాక్షపాతంగా ఎంకై ్వరీ జరిపి దీని వెనుకన్న వారి పాత్రను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.
వామ్మో.. ఇంతా
ఉదయగిరి ఎమ్మెల్‌ఎస్ పాయింట్ నుంచి 211.55 టన్నుల బియ్యం.. 1587 కిలోల చక్కెర.. 1378 కిలోల కందిపప్పు.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన 2525 కిలోల బియ్యం బస్తాలు.. అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన 0.12 టన్నులు (మూడు కిలోల) బియ్యం బస్తాలు, ఏడు లీటర్ల ఆయిల్ ప్యాకెట్లను స్వాహా చేశారనే అంశాన్ని రాష్ట్రాధికారుల బృందం తేల్చింది. వీటి విలువ రూ.1,05,43,876గా పేర్కొన్నారు. కారకుల నుంచి రూ.2,10,87,755ను రివకరీ చేయాలని నివేదికలో పొందుపర్చారు. ఈ పరిణామాల క్రమంలో వ్యవహారంతో సంబంధమున్న ఉదయగిరికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉదయగిరిలోని సివిల్ సప్లయ్స్ గోదాము (ఫైల్)
ఉదయగిరి ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌లో మాయాజాలం
కలకలం సృష్టిస్తున్న బియ్యం
స్వాహా వ్యవహారం
కొల్లగొట్టిన సరుకుల విలువ
అక్షరాలా రూ.కోటి
ఇంత పక్కదారి పట్టించడం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సాధ్యమా..?
పెద్దల హస్తంపై అనుమానాలు


