అమరజీవి త్యాగం చిరస్మరణీయం
నెల్లూరు (దర్గామిట్ట): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం నిర్వహించారు. అమరజీవి చిత్రపటానికి జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు అమరజీవి అన్నారు. ఆయన త్యాగ ఫలితంగానే తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. డీబీసీడబ్ల్యూఓ వెంకటలక్ష్మమ్మ, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే డీడీ నాగశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
నూతన విద్యా విధానంలో
ఇంటర్ పరీక్షలు
నెల్లూరు (టౌన్): ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ వరప్రసాదరావు తెలిపారు. నగరంలోని రావూస్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు ఓరియంటేషన్ తరగతులను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాత విధానంలోనే పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఇంటర్‌బోర్డు అబ్జర్వర్ జీ నరసింహరావు రీసోర్స్‌పర్సన్లు పరీక్షల నిర్వహణ విధానంపై పరీక్షల సిబ్బంది, సీఎస్, ఏసీఎస్, డిపార్ట్‌మెంట్ అధికారులు, కస్టోడియన్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీవీఈఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యాసరచన,
వక్తృత్వ పోటీలు రేపు
నెల్లూరు (టౌన్): జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్ బాలాజీరావు సోమవారం తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్ట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు పోటీలు జరుగుతాయని చెప్పారు. తెలుగులో ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం’, ఇంగ్లిష్‌లో ‘ఎఫిషియంట్ అండ్ స్పీడ్ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టీస్’ అనే అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ.2వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 95538 84296 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
కామాక్షితాయి
దర్శన వేళల్లో మార్పు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లుగా ఈఓ శ్రీనివాసులరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి శుక్రవారం మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 గంటల వరకు దర్శనం కల్పిస్తామని వివరించారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తు లకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు.
అమరజీవి త్యాగం చిరస్మరణీయం


