మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ
నెల్లూరు రూరల్: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సోమవారం ఆవిష్కరించారు. సుపరిపాలన బస్సు యాత్రలో భాగంగా సోమవారం అయ్యప్ప గుడి సెంటర్ నుంచి హరనాథపురం వరకు మోటార్‌బైక్‌ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాజ్‌పేయి విగ్రహావిష్కరణ చేసి బహిరంగ సభలో మాట్లాడారు. పదవులు కాదు.. విలువలు ముఖ్యమని నమ్మిన నేత వాజ్‌పేయి అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్‌ను వృథా చేయొద్దు : జేసీ
● నెల్లూరులో ర్యాలీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్‌ను వృథా చేయకుండా పొదుపుగా వాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జేసీ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం నెల్లూరులోని విద్యుత్ భవన్ నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. జేసీ ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లలో, కార్యాలయాల్లో అవసరమైన సమయాల్లోనే లైట్లు, ఫ్యాన్లు వినియోగించాలని సూచించారు. సోలార్, విండ్ విద్యుత్‌పై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం, అకౌంట్స్ ఆఫీసర్ మురళి, ఈఈలు శేషాద్రిబాలచంద్ర, లక్ష్మీనారాయణ, శ్రీధర్, పరంధామయ్య, రమేష్ చౌదరి, బెనర్జీ, భానునాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి కమిషనర్‌గా శ్రీలక్ష్మి నియామకం
నెల్లూరు (బారకాసు): కమిషనర్ వైఓ నందన్ మూడురోజుల విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు నగర పాలక సెక్రటరీగా ఉన్న ఎం.శ్రీలక్ష్మికి (ఎఫ్‌ఏసీ) బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. బుధవారం వరకు కమిషనర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ ఫెస్ట్
నెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 18వ తేదీ వరకు కెరీర్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. సోమవారం నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో మెంటల్ హెల్త్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో స్వీయ అవగాహన, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళిక, సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. మండల స్థాయిలో ఐదు బెస్ట్ మోడల్స్ ఎంపిక చేసి ఈనెల 20న జిల్లా లెవల్ ప్రోగ్రాం కెరీర్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ
మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ


