కాళ్లరిగేలా తిరిగినా.. వీడని నిర్లక్ష్యం
నెల్లూరు(దర్గామిట్ట): సమస్యలు పరిష్కరించండి సారూ అంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లా పాలనాధికారికి చెప్పినా పరిస్థితులు మారడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధిక శాతం వినతులు భూ సమస్యలపైనే వస్తున్నాయి. గ్రామ, మండల స్థాయి రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం సామాన్య ప్రజానీకానికి శాపంగా మారుతోంది. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 433 సమస్యలపై అర్జీలు రాగా అందులో 187 రెవెన్యూ సమస్యలు కావడం గమనార్హం. మున్సిపల్ సమస్యలు 53 తదితరాలున్నాయి. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డీడీ నాగశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● రాపూరుకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించి షాపులు కడుతున్నారని, అధికారులు చర్యలు చేపట్టాలని సైదాన్ సాహిబ్, ముత్తహన్‌షఫీ వినతిపత్రం అందజేశారు.
● గూడూరు డివిజన్‌ను నెల్లూరులో కలపాలని బీజేపీ నేత మిడతల రమేష్ డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారు.
● రేషన్‌కార్డులో మాకు సంబంధం లేని వారిని చేర్చడంతో సంక్షేమ పథకాలు కోల్పోతున్నాం. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ముత్తుకూరు మండలం ఈదూరు మిట్టపాళేనికి చెందిన సుప్రజ వాపోయారు.
● నెల్లూరును డ్రగ్స్, గంజాయి రహితంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, నగరంలో ఇటీవల జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సామాజికవేత్త ఈర్ల రమణయ్య జేసీకి వినతిపత్రం అందజేశారు.
● బధిరులకు ప్రభుత్వ ఆర్థిక, సంక్షేమ ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని బధిరుల జిల్లా సంక్షేమ సంఘం చైర్మన్ మస్తానయ్య, ప్రవీణ్ కలెక్టర్‌కు విన్నవించారు.
● కలువాయి మండలం టీపీ అగ్రహారానికి చెందిన నాపా పెంచలమ్మ పేరున ఉన్న భూమికి సంబంధించి రికార్డులు తారుమారు చేశారని, చర్యలు చేపట్టాలని నాపా నవీన్ కోరారు.
● వేదాయపాళెం రెవెన్యూ పరిధిలో బోగస్ రికార్డులు సృష్టించి స్థలాన్ని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని చేకూరి సురేష్ కోరారు.
కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
పోటెత్తి వస్తున్న ప్రజలు
సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన
కాళ్లరిగేలా తిరిగినా.. వీడని నిర్లక్ష్యం
కాళ్లరిగేలా తిరిగినా.. వీడని నిర్లక్ష్యం


