దూసుకొచ్చిన మృత్యువు
● కూరగాయలు కొనేందుకు వచ్చిన
వ్యక్తి మృతి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
దుత్తలూరు: అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన దుకాణాల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం మండలంలోని నందిపాడు సెంటర్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మర్రిపాడు మండలం ఉమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బిల్లుపాటి నరేష్ నందిపాడు సెంటర్‌లో కూరగాయల దుకాణం నడుపుతున్నాడు. మర్రిపాడు మండలం పెదమాచనూరు గ్రామానికి చెందిన ఆకుల రమణారెడ్డి (52), అంబటి వెంకటకృష్ణమ్మలు అక్కడికెళ్లి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన గడ్డం రామసుబ్బారెడ్డి పని నిమిత్తం కావలికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో నందిపాడు సెంటర్ సమీపంలోకి వచ్చేసరికి కారు అదుపుతప్పి కుడివైపునున్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. నరేష్‌తోపాటు రమణారెడ్డి, వెంకటకృష్ణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో వారొచ్చి క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమణారెడ్డి మృతిచెందాడు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు, నెల్లూరు వైద్యశాలలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
దూసుకొచ్చిన మృత్యువు


