జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ.. తూర్పు ప్రాంతంతో సమానంగా పశ్చిమ మెట్ట ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లోని ఎస్సార్ శంకరన్ హాల్లో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఆత్మకూరు, ఉదయగిరి మెట్ట ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించే అంశమై పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే 11 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని, ఆరు కంపెనీల కోసం భూసేకరణ జరుగుతోందని వెల్లడించారు. జలదంకి, దుత్తలూరులో కొన్నింటిని నెలకొల్పేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
బీపీసీఎల్ భూమి పూజకు సన్నాహాలు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రాజెక్ట్ కోసం 3200 ఎకరాలను సేకరించామని, మరో 2800 ఎకరాలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి పూజను జరపనున్నారని తెలిపారు. ఇండోసోల్ పరిశ్రమకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇఫ్కో కిసాన్‌సెజ్‌కు భూములను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్, బీపీసీఎల్ పరిశ్రమల ఏర్పాటుతో కావలి నియోజకవర్గం ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందనుందని ప్రకటించారు. కోవూరు చక్కెర కర్మాగారాన్ని ఏపీఐఐసీకి అప్పగించి, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. నెల్లూరు నగరంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలను అభివృద్ధి చేస్తూ.. ఇక్కడే యువతకు ఐటీ తరహాలో ఉద్యోగాలు కల్పించేందుకు గానూ ఉన్నత రంగాల్లో స్థిరపడిన పలువురు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నామని చెప్పారు.
వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. డెల్టా ఆధునికీకరణకు చర్యలు చేపడతామని వెల్లడించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో నైపుణ్యాభివృద్ధి, సరికొత్త విధానాలతో పంటలను సాగు చేసే ఒక చాంపియన్ రైతును ఎంపిక చేసి, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా కార్యక్రమాలను నిర్వహించనున్నామని వివరించారు.
అర్జీల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పరిష్కరించిన అర్జీలపై అభిప్రాయం తెలుసుకునేందుకు ఆడిట్ టీమ్‌లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక గ్రామం.. ఒక నెల కార్యక్రమాన్ని త్వరలో అమలు చేయనున్నామని చెప్పారు. నెల్లో ఒక గ్రామంలో నాలుగుసార్లు అధికారులే నేరుగా ప్రజల వద్దకెళ్లి సమస్యలను అడిగి పరిష్కరించనున్నారన్నారు. సదరు విలేజ్‌లో 50 శాతం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దీన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. మైపాడు బీచ్.. ఉదయగిరి కోటను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.


