జిల్లాలో ఇలా..
● జిల్లాలో పదో తరగతికి
నూరు రోజుల ప్రణాళిక అమలు
● మానిటరింగ్‌కు ఇన్‌చార్జీల ఏర్పాటు
● ఇతర శాఖల్లో పనిచేసే వారికి బాధ్యతలు
● జిల్లాలోని 38 మండలాలకు 38 మంది
● రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ
అధికారుల అనధికార ఆదేశాలు
● సంబంధంలేని వ్యక్తుల
నియామకంపై వ్యతిరేకత
ఇన్‌చార్జీలను
నియమించడమేమిటి..?
విద్యారంగంపై ఇతర శాఖల పెత్తనమేమిటి. నూరు రోజుల కార్యక్రమ పర్యవేక్షణకు ఇలా వేరే వారిని నియమించడం సహేతుకుం కాదు. ఇది ఉపాధ్యాయుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగునకు టీచర్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తుండగా, పర్యవేక్షణ పేరుతో భయాందోళనలకు గురిచేయడం తగదు.
– మోహన్‌దాస్, రాష్ట్ర నేత, ఏపీటీఎఫ్
నియామకాన్ని వ్యతిరేకిస్తున్నాం
నూరు రోజుల ప్రోగ్రామ్ ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తుంది. కార్యక్రమ పర్యవేక్షణకు ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, జిల్లా స్థాయిలో డీఈఓ ఉన్నారు. అయితే ఇతర శాఖల వారిని ఇన్‌చార్జీలుగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
– చలపతిశర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
మౌఖిక ఆదేశాలు జారీ చేశారు
పదో తరగతిలో నూరు రోజుల కార్యక్రమ అమలుకు ఇన్‌చార్జీలను నియమించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని ఆయా పాఠశాలలకెళ్లి రోజూ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇన్‌చార్జీలకు సహకరించాల్సిందే. పదో తరగతిలో 100 శాతం ఫలితాలే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
– బాలాజీరావు, డీఈఓ
తరగతి గదిలో విద్యార్థులు
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళం ఏర్పడుతోంది. ఎప్పుడెలాంటి ఆదేశాలు జారీ చేస్తారో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికే రకరకాల యాప్‌ల నమోదుతో హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటుండగా, తాజాగా ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో నూరు రోజుల ప్రణాళికను విధిగా అమలు చేయాలని సర్కార్ ఆదేశించింది. శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవుల్లోనూ తరగతులను నిర్వహించాలని పేర్కొనడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లాలోని 38 మండలాలకు ఒకరు చొప్పున ఇన్‌చార్జీలను కలెక్టర్ హిమాన్షు శుక్లా నియమించారు. విద్యాశాఖతో సంబంధం లేని ఇతర శాఖల ఉద్యోగులు, అధికారులను అపాయింట్ చేయడంపై టీచర్లు గుర్రుగా ఉన్నారు.
Planning
నెల్లూరు (టౌన్): పదో తరగతికి సంబంధించి అమలు చేస్తున్న నూరు రోజుల ప్రణాళిక గందరగోళానికి దారితీస్తోంది. విద్యాశాఖతో సంబంధంలేని వ్యక్తుల నియామకం అగ్గిని రాజేస్తోంది. ఈ ఆదేశాలపై ఆ శాఖలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియ మొత్తం ఇన్‌చార్జీల కనుసన్నల్లో జరగనుంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ మొదలుకొని స్లిప్ టెస్ట్, మార్కుల నమోదు, రిజిస్టర్ల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు.. ఇలా అన్నింటినీ పబ్లిక్ పరీక్షల ప్రారంభం వరకు ఇన్‌చార్జిలే పర్యవేక్షించనున్నారు.
ఇన్‌చార్జీలుగా ఇతర శాఖల అధికారులు
రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, వైద్య, ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయ, ఇరిగేషన్, జీఎస్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్, వెటర్నరీ తదితర శాఖల్లో పనిచేస్తున్న అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరంతా వారి మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకెళ్లి పదో తరగతిలో ప్రణాళిక అమలు అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. స్లిప్ టెస్ట్‌లు, ఉపాధ్యాయుల హాజరు, పదిలో షైనింగ్.. రైజింగ్ స్టార్లుగా విభజించి పాఠాలను బోధిస్తున్నారాననే అంశాన్ని రోజూ పర్యవేక్షించాలి. ఉపాధ్యాయుల హాజరు నమోదు, సబ్జెక్ట్ టీచర్లొస్తున్నారా, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో తరగతులను నిర్వహిస్తున్నారాననే అంశాన్ని మానిటర్ చేయాల్సి ఉంది.
వీరి పర్యవేక్షణపై మండిపాటు
ఇతర శాఖల అధికారులను నియమించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ప్రతి మండలానికీ ఎంఈఓ – 1, 2లున్నారు. వీరితో పాటు నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు ప్రాంతాల్లో డిప్యూటీ డీఈఓలతో పాటు ప్రతి పాఠశాలకూ హెడ్‌మాస్టర్ ఉన్నారు. ప్రణాళిక అమలు పర్యవేక్షణకు వీరున్నప్పుడు ఇతర శాఖల అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరిని అపాయింట్ చేయడం తమను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, రికార్డులు, పది సిలబస్‌పై వీరికి ఏ మేరకు అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ నూరు రోజుల పాటు సదరు ఇన్‌చార్జీలు తమ శాఖలో జరిగే పనులను మాని.. దీన్ని పర్యవేక్షిస్తారాననే అనుమానాలూ తలెత్తుతున్నాయి.
జిల్లాలో 393 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 16 వేల మందికిపైగా విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 16 ఉంచి నిర్వహించనున్నామంటూ షెడ్యూల్‌నూ ప్రకటించారు. ఈ తరుణంలో ఈ నెల ఆరు నుంచి నూరు రోజుల ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించారు. దీని అమలును పర్యవేక్షించేందుకు గానూ మండలానికో ఇన్‌చార్జీని నియమించాలని రాష్ట్ర పాఠశాల శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో వీరిని నియమిస్తూ ఉత్తర్వులను కలెక్టర్ విడుదల చేశారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో ఇలా..
జిల్లాలో ఇలా..
జిల్లాలో ఇలా..


