‘కోటి సంతకాలు’ విజయవంతంపై కృతజ్ఞతలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలను మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలియజేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితతో కలిసి విలేకరుల సమావేశంలో కాకాణి మంగళవారం మాట్లాడారు. నాడు ఎంతో ఉన్నతాశయంలో 17 మెడికల్ కళాశాలలకు అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని, అయితే వీటిలో పదింటిని ప్రైవేటీకరించేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పూనుకున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగా కోటి సంతకాలను సేకరించామని, వీటిని గవర్నర్‌కు అందజేయనున్నామని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రజాప్రయోజనాల కంటే తన స్వార్థమే ముఖ్యమని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించిందని, అయినా ప్రజలు ముందుకొచ్చి విజయవంతం చేశారని చెప్పారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నిర్వహించిన ర్యాలీలకు ప్రజలు భారీగా హాజరై సక్సెస్ చేశారని వివరించారు.
టీడీపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు
నగరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి అశేష జనవాహిని తరలివచ్చిందన్నారు. తమ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, అనేక అడ్డంకులను పోలీసులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలను విస్మరించి, అధికార పార్టీ నేతలకు ఖాకీలు కొమ్ముకాస్తున్నారని, టీడీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు చెక్కు చెదరలేదనేందుకు నెల్లూరులో నిర్వహించిన ర్యాలీనే నిదర్శనమని తెలిపారు. జిల్లాలో నియోజకవర్గాల ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ఏడు లక్షల సంతకాలను సేకరించామని వెల్లడించారు. అందరి సహకారంలోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
నిరసనను తెలియజేస్తూనే ఉంటాం
టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనను తమ పార్టీ తెలియజేస్తూనే ఉంటుందని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారం లేకపోతే ప్రజల మధ్య టీడీపీ ఎప్పుడూ ఉండదని చెప్పారు. పార్టీలకతీతంగా ప్రతి ఇంటి నుంచీ తరలివచ్చి తమ వ్యతిరేకతను సంతకాల రూపంలో తెలియజేశారన్నారు.
మాటకు కట్టుబడే నేత జగన్
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నేత జగన్‌మోహన్‌రెడ్డి అని పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. చంద్రబాబు తన స్వలాభం కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ఆ తర్వాత మరోలా మాట్లాడటం ఆయన నైజమని విమర్శించారు. అనంతరం కిలివేటి సంజీవయ్య మాట్లాడారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. కాకాణి పూజిత మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజేసేందుకు అవకాశంగా ప్రజలు ఉపయోగించుకున్నారని చెప్పారు. నెల్లూరులో నిర్వహించిన ర్యాలీ ప్రభుత్వ వైఫల్యానికి.. వారిపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని తెలిపారు.


