పల్లె సీమల్లో రెవెన్యూ చిచ్చు
● పేట్రేగిపోతున్న అధికార పార్టీ
నేతల దౌర్జన్యాలు
● రైతు పొలంలో దౌర్జన్యంగా దారి ఏర్పాటు
● కోర్టు ఆదేశాలున్నా,
పట్టించుకోని అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికార యంత్రాంగం నోరు మెదపకపోతుండటంతో పచ్చని పల్లె సీమల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. జిల్లాలోని సైదాపురం మండలంలో గల ఓ రైతు పొలంలో దారిని దౌర్జన్యంగా వేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మండలంలోని గిద్దలూరుకు చెందిన రైతు కొండా లక్ష్మణరెడ్డికి సర్వే నంబర్ 578లో ఎకరా 65 సెంట్ల భూమి ఉంది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో సదరు భూమిలో దారి వేసేందుకు పలుమార్లు యత్నించారని రైతు చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు విన్నవించుకున్నానని తెలిపారు. కోర్టును ఆశ్రయించగా, రైతు అనుమతి లేకుండా దారి వేయొద్దనే ఉత్తర్వులను పొందామని వివరించారు. ఈ క్రమంలో నోటీసులను సైతం ఇవ్వకుండా దారి వేసేందుకు కొలతలు తీసేందుకు స్థానిక అధికారులు సోమవారం వచ్చి, ట్రాక్టర్‌తో దున్నేందుకు యత్నించారన్నారు. ఈ క్రమంలో రైతు కుటుంబసభ్యులు, మహిళలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలకు అడ్డొచ్చిన మహిళలపై దౌర్జన్యం చేసి పక్కకు నెట్టేశారు. చివరికి పొలం మధ్యలో దారిని మంగళవారం వేశారు. రెవెన్యూ అధికారుల తీరుతో ఇరువర్గాల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మండలంలోని పాలూరులో దళితులు, భూస్వాముల మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. వీటిలో అధికార పార్టీ నేత జామాయిల్ సాగు చేపట్టారని, ఈ విషయంలోనూ పచ్చ నేతలకే రెవెన్యూ అఽధికారులు జై కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.


