20.95 కిలోల గంజాయి స్వాధీనం
● నలుగురు పాత నేరస్తుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రేతల ఇంటిపై సంతపేట పోలీసులు మంగళవారం దాడి చేసి 20.95 కిలోల గంజాయి, నగదును స్వాధీనం చేసుకున్నారు. సంతపేట పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్‌స్పెక్టర్ సోమయ్య మంగళవారం వెల్లడించారు. నగరంలోని కపాడిపాళెంలో గల రాయపువీధిలో నివాసం ఉంటున్న ముంతాజ్‌కు సిరాజ్, జమీర్, పాషుర్ కుమారులు. ఒడిశా, విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున గంజాయిని నెల్లూరుకు తీసుకొచ్చి వీటిని చిన్న పొట్లాలుగా మార్చి నగరంలో విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. గతంలో ముంతాజ్‌తో పాటు సిరాజ్, జమీర్, కోడలు సుభానీపై పీడీ యాక్ట్‌ను ఎస్‌ఈబీ, సంతపేట పోలీసులు ప్రయోగించారు. అయినా వీరి తీరులో మార్పురాలేదు. గంజాయి విక్రయాలు సాగిస్తున్నారనే సమాచారం ఇన్‌స్పెక్టర్‌కు అందింది. ఎస్సై బాలకృష్ణ, సిబ్బందితో కలిసి ముంతాజ్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న 20.950 కిలోల గంజాయిని, రూ.5,600ను స్వాధీనం చేసుకొని.. ముంతాజ్, ఆమె కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభానీని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పాషుర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ 6,28,500 ఉంటుందని చెప్పారు.


