ఫిర్యాదుల వెల్లువ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 114 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ అజిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంఽధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, డీసీఆర్‌బీ, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు ఎన్.రామారావు, టీవీ సుబ్బారావు, ఫిర్యాదు విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● ఓ వ్యక్తి వాట్సాప్‌లో పరిచయమయ్యాడు. ఆన్‌లైన్‌లో బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక నగదు వస్తుందని ఆశ చూపాడు. రూ.11,65,771 పెట్టుబడి పెట్టాను. నగదు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి కోరాడు.
● నా ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచాను. నేను ఓ చిన్న ఇంట్లో ఉంటున్నా. పెద్ద కుమారుడు, కోడలు ఆ ఇంటినిచ్చి వెళ్లిపోవాలని నన్ను, నా భర్తను వేధిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలని ఇందుకూరుపేట మండలంకు చెందిన ఓ వృద్ధురాలు కోరారు.
● నా కుమార్తె భర్తతో విభేదాల కారణంగా నా వద్దనే ఉంటోంది. అతని వేధింపులు భరించలేక ఒకటిన్నర నెల క్రితం కుమార్తె ఎటో వెళ్లిపోయింది. ఆచూకీ తెలియజేయాలని రాపూరుకు చెందిన ఓ మహిళ కోరారు.
● నా పొలం విషయంలో ప్రసాద్ మరికొందరు నాపై దాడి చేశారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయినా పొలం సాగుచేసుకోనివ్వకుండా ప్రసాద్ ఇబ్బందులు పెడుతున్నారని కలువాయికి చెందిన ఓ ఫిర్యాదు చేశాడు.
● భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం వేధిస్తున్నారు. నా జీవనాధారం కష్టంగా ఉంది. విచారించి చర్యలు తీసుకోవాలని వెంకటాచలసత్రానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● భర్త మరణించడంతో అత్త, ఆడపడుచులు కొట్టి నన్ను, నా ముగ్గురు ఆడపిల్లలను ఇంటి నుంచి గెంటేశారు. జీవించడం కష్టంగా ఉందని బిట్రగుంటకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.


