తిరుపతి వద్దు.. నెల్లూరు ముద్దు
● పునర్విభజనకు వ్యతిరేకంగా
కలువాయి వాసుల ఆందోళన
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా పునర్విభజనపై నిరసన సెగలు రగులుతున్నాయి. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయొద్దని, యథాతథంగా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతూ ఆ మండల ప్రజలు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కలువాయి వాసులు పెద్ద ఎత్తున నెల్లూరుకు చేరుకుని కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తిరుపతి వద్దు.. నెల్లూరు ముద్దు, సేవ్ కలువాయి అంటూ పెద్ద ఎత్తున కలెక్టరేట్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి నుంచి తిరుపతికి దూరం 140 కిలోమీటర్లు కాగా రోజుకు ఒక్క బస్సు మాత్రమే ఉందన్నారు. నెల్లూరుకు 69 కిలోమీటర్ల దూరం కాగా ప్రతి అరగంటకు బస్సు ఉందన్నారు. కలువాయి మండలాన్ని ఆత్మకూరు డివిజన్ నుంచి గూడూరు డివిజన్‌లోకి మార్చి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతామన్నారు. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలన్నది మండల ప్రజల ఏకాభిప్రాయమన్నారు. అందువల్ల ఆత్మకూరు డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా కలువాయి వాసుల వద్దకు వచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలువాయి మండల నాయకులు రఘురామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మహిళలు, యువకులు పాల్గొన్నారు.


