విద్యాశాఖాధికారుల విచారణ
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలం జనార్దనపురం పాఠశాల ఉపాధ్యాయుడు తరచూ విధులకు గైర్హాజరు కావపోవడం.. ఈ విషయం తెలిసినా ఎంఈఓలు చర్యలు చేపట్టకుండా అతడికి మద్దతుగా నిలవడం.. శనివారం అటెండర్‌ను డిప్యుటేషన్ వేయడంతో పాఠశాల శాశ్వతంగా మూతబడే అవకాశం ఉందంటూ ఆదివారం సాక్షిలో ‘ఆ బడికి అయ్యోరే శాపం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో డీఈఓ బాలాజీరావు స్పందించి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కావలి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్‌ను ఆదేశించారు. ఆయన వింజమూరు ఎంఈఓ కార్యాలయానికి వచ్చారు. పాఠశాలకు చెందిన రికార్డులను కార్యాలయం అటెండర్ బి.శ్రీహరి ద్వారా తెప్పించుకున్నారు. అనంతరం ఎంఈఓ 1 పి.రమేష్, ఎంఈఓ 2 మధుసూదన్‌రెడ్డి, టీచర్ ఆవుల రాజు, శనివారం విధుల్లో ఉన్న అటెండర్ శ్రీహరిని విచారించారు. వారి నుంచి లిఖితపూర్వకంగా సంజాయిషీ లేఖలను తీసుకున్నారు. తర్వాత డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ డీఈఓ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి నివేదికను పంపుతామన్నారు. కాగా విచారణాధికారి జనార్దనపురం వెళ్లి గ్రామస్తుల స్టేట్‌మెంట్ తీసుకోలేదు.


