జిల్లా విభజన.. జల సంఘర్షణ
పొదలకూరు: కూటమి ప్రభుత్వం జిల్లాల విభజన సర్దుబాటు తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. ప్రధానంగా రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలకు చెందిన రైతులతోపాటు సాధారణ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భౌగోళిక పరిస్థితులతోపాటు ప్రజాభీష్టం మేరకు విభజన జరగలేదని అభిప్రాయపడుతున్నారు. ఆ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలపడంతో జిల్లాల మధ్య సాగునీటి వివాదాలు చోటుచేసుకునే అవకాశంతోపాటు పొదలకూరు మండలానికి సాగునీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని మేధావులు అంటున్నారు. దీంతో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చూస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నిరసనలు, డిమాండ్లపై ఇప్పటి వరకు స్పందించిన దాఖలాల్లేవు. మూడు మండలాలను తిరుపతిలో కలిపితే భవిష్యత్ ఉంటుందని మంత్రివర్గ సబ్ కమిటీకి చెందిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్ వెల్లడించారు.
సాగునీటిపై ఆందోళన
పొదలకూరు మండలంలో సోమశిల, కండలేరు నుంచి సాగునీరు అందుతుంది. 90 శాతం వ్యవసాయం ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న కాలువల నీటి ద్వారానే మెట్ట, మాగాణి వ్యవసాయం సాగుతోంది. ప్రాజెక్ట్‌లు ఒక జిల్లాలో, కాలువలు మరో జిల్లాలో ఉంటే సాగునీటి కేటాయింపులో అన్యాయం జరుగుతుందని ప్రజాప్రతినిధులతోపాటు రైతులు అభిప్రాయపడుతున్నారు. పొదలకూరు మండలంలో సోమశిల దక్షిణ కాలువ ఉంది. దీనికి కలువాయి రిజర్వాయర్ ద్వారా చేజర్ల మండలం మీదుగా నీరు సరఫరా కావాల్సి ఉంది. అలా జరిగితే చేజర్ల మండలంలో 20 వేల ఎకరాలు, పొదలకూరు మండలంలో 5 వేల ఎకరాలు రబీ సీజన్లో వరినాట్లు పడతాయి. కలువాయిని తిరుపతిలో కలిపితే రిజర్వాయర్ ఒక జిల్లాలో కాలువలు మరో జిల్లాలో ఉంటాయి.
గత ప్రభుత్వంలో కొనసాగింపు
సాగునీటి జలాల సమస్యలు తలెత్తుతాయని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా పునర్విభజనలో ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంది. దీని ప్రకారం కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించింది. ఈ మూడు మండలాలు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నా భౌళిక పరిస్థితులు, సాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో కొనసాగించారు. అయితే కూటమి ప్రభుత్వం తిరిగి పునర్విభజనను చేపట్టి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలను పూర్తిగా తిరుపతి జిల్లాలో కలపడంపై నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి
32 చెరువులకు..
కండలేరు జలాశయం రాపూరు మండలంలో ఉండగా 11 కి.మీ పొడువున్న మట్టికట్ట చేజర్ల, పొదలకూరు, రాపూరు మండలాల పరిధిలో ఉంది. పొదలకూరుకు వరప్రదాయినిగా ఉన్న కండలేరు ఎడమగట్టు కాలువ ద్వారా పొదలకూరు, చేజర్ల మండలాల్లో 32 చెరువులకు నీటిని అందించి మెట్ట, మాగాణి పంటలు పండుతున్నాయి. కండలేరులో నీరు తగ్గితే ఎడమగట్టు కాలువకు పంపింగ్ స్కీమ్ ద్వారా విడుదల చేస్తుంటారు. స్కీమ్ రాపూరు మండలంలో ఉంది. ఈ కాలువ కింద 22 వేల ఎకరాల్లో పంటలకు నీటిని అందించాల్సి ఉంటుంది. కండలేరు ఒకటో నంబర్ బ్రాంచ్ కాలువ ద్వారా పొదలకూరు, సైదాపురం మండలాల్లో 10 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు బ్రాంచ్ కాలువ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ కాలువకు రాపూరు మండలం సంక్రాంతిపల్లి పికప్ ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.
కండలేరు జలాశయం
ప్రాజెక్ట్‌లు ఒకచోట..
కాలువలు మరోచోట
కండలేరు మట్టికట్టలో కొంత భాగం పొదలకూరులోనే..
తీవ్ర నష్టం కలిగే అవకాశం
మండలాల విభజనపై నిరసన
గత ప్రభుత్వంలో కలువాయి, రాపూరు, సైదాపురం నెల్లూరులోనే..
జిల్లా విభజన.. జల సంఘర్షణ
జిల్లా విభజన.. జల సంఘర్షణ


