కూటమి నేతల మధ్య ఘర్షణ
● దాడి చేసుకున్న జనసేన, టీడీపీ నేతలు
● ఇద్దరికి గాయాలు
● పరస్పర ఫిర్యాదులు
● రాజీ కోసం ప్రయత్నాలు
సంగం: రాష్ట్ర మంత్రి ఆనం రామానారాయణరెడ్డి ఆదివారం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో దువ్వూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద టీడీపీ, జనసేన నేతలు నడిరోడ్డుపై శనివారం రాత్రి కొట్టుకోగా ఇద్దరు నేతలు గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దువ్వూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ మారెళ్ల కృష్ణమ్మ కుమారుడు, టీడీపీ దళిత నేత మారెళ్ల శ్రీనివాసులు అంగడి వద్ద ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన నేత దాడి భానుకిరణ్ ఫ్లెక్సీ కట్టేందుకు శనివారం అర్ధరాత్రి ప్రయత్నించాడు. అంగడి వద్ద తమ పార్టీ ఫ్లెక్సీలు కట్టుకుంటామని, మీరు కట్టవద్దంటూ శ్రీనివాసులు అడ్డుపడ్డాడు. దీంతో ఘర్షణ జరిగి ఇద్దరూ కొట్టుకున్నారు. కిరణ్ రాయితో కొట్టడంతో శ్రీనివాసులు ముఖంపై గాయమైంది. శ్రీనివాసులు కొట్టడంతో భాను సైతం స్వల్పంగా గాయపడ్డాడు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. భాను కులం పేరుతో దూషిస్తూ రాయితో గాయపరిచాడని శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో రెండు పార్టీల కు చెందిన పెద్ద నేతలు రాజీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా బయటపడి కేసులు లేకుండా చూసుకోవాలని ఇరువురికి సూచించినట్లు తెలిసింది.
భగ్గుమన్న దళిత నేతలు
దాడిలో శ్రీనివాసులు గాయపడితే అగ్రవర్ణాల వారు కేసును రాజీ చేసేందుకు ప్రయత్నించడంపై దళిత నేతలు భగ్గుమంటున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగం పోలీసులు రెండు ఫిర్యాదులను తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


