ఇరిగేషన్ పనులపై సీబీఐ విచారణకు సిద్ధమా..?
పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనుల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా.. గత ప్రభుత్వం, ఇప్పటి సర్కార్‌లో జరిగిన దోపిడీపై నిగ్గుతేల్చే దమ్ముందానంటూ సోమిరెడ్డిపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని నల్లపాళెంలో ఆదివారం పర్యటించి.. రైతుల సమస్యలను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. తాను చేసిన అవినీతి ఆరోపణలపై సోమిరెడ్డి మాట్లాడకుండా.. గత ప్రభుత్వ హయాంలో షట్టర్లు బిగించకుండా దొంగ బిల్లులు చేసుకున్నారంటున్నారని ధ్వజమెత్తారు. అవినీతిని దాటవేసేందుకు ఎంత యత్నించినా, ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. విజిలెన్స్ విచారణ పేరుతో ఆయనకు అనుకూలంగా నివేదికలను తయారు చేయించుకునేందుకు యత్నిస్తున్నారని, సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే పలాయనం చిత్తగిస్తున్నారని విమర్శించారు. దేవుళ్లకే శఠగోపం పెడుతున్న వారికి ఇతర పనుల్లో అవినీతికి పాల్పడటం పెద్ద లెక్క కాదని చెప్పారు.
గోవధను ప్రోత్సహిస్తున్నారు..
గొలగమూడి రోడ్డులో సంతను సోమిరెడ్డి కుమారుడు పెట్టించి.. నెలకు రూ.ఐదు లక్షలను వసూలు చేస్తున్నారని, ఆవులను విక్రయించే వారికి వత్తాసు పలుకుతూ గోవధను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బ్రాందీషాపుల్లోనూ కమీషన్లను వసూలు చేస్తున్నారని విమర్శించారు. మోంథా తుఫాన్ పేరుతో పనులు చేయకుండానే రూ.16.9 కోట్లను దోచుకునేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. ఇరిగేషన్ పనులే కాక ప్రతి శాఖలో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించి గ్రామాల్లో సభలను ఏర్పాటు చేసి ఎండగడతామని ప్రకటించారు. సర్వేపల్లిలో గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను వదలకుండా దోపిడీకి పాల్పడుతూ.. పామాయిల్ ట్యాంకర్ల వద్దా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడుతూ, ధనార్జనే ధ్యేయంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. యూరియా లభ్యం కావడం లేదని.. వరి సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం నల్లపాళెంలో నంది రమణారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, నేతలు పోలిరెడ్డి, లచ్చారెడ్డి, నంది శ్రీనివాసులురెడ్డి, శ్రీహరి, శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరమణారెడ్డి, మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దొంగ బిల్లులు ఎవరి హయాంలో
జరిగాయో తేల్చాలి
దోపిడీపై నిగ్గుతేల్చాలి
సోమిరెడ్డిపై ధ్వజమెత్తిన
కాకాణి గోవర్ధన్‌రెడ్డి


