స్టార్టప్‌లపై యువత ఆసక్తి
● వీఎస్‌యూ వీసీ శ్రీనివాసరావు
వెంకటాచలం: స్టార్టప్‌లపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోందని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్‌యూలో గురువారం టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్వంలో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఇంటర్న్
షిప్ అండ్ స్టార్టప్ డెవలప్‌మెంట్ ఫ్రమ్ ఐడియా టు ఎగ్జిక్యూషన్ పేరుతో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు సంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, తమ సృజనాత్మకత, నైపుణ్యాలను ఉపయోగించి కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించాలని సూచించారు. స్టార్టప్‌ల్లో విజయం సాధించాలంటే మార్కెట్‌పై అవగాహన, స్పష్టమైన ప్రణాళిక, టీమ్ వర్క్, కొత్త ఆలోచనలు కీలకమని వెల్లడించారు. విద్యార్థుల్లో వ్యాపార ధోరణిని పెంపొందించేందుకు యూనివర్సిటీ అన్నివిధాలా సహకరిస్తుందని తెలియజేశారు. మంచి స్టార్టప్ ఐడియా తెచ్చిన వారికి ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహిస్తామన్నారు. స్టార్టప్‌ల ప్రాముఖ్యత, వ్యాపార ఆలోచనలను అమలు దిశగా తీసుకెళ్లే వ్యూహాలు, ప్రస్తుత పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాల గురించి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ రూసా సీఈఓ వంశీకృష్ణ వివరించారు. కార్యక్రమంలో టూరిజం మేనేజ్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు.


