నవోదయలో ప్రవేశానికి 13న పరీక్ష
మర్రిపాడు: నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్షను ఈ నెల 13న నిర్వహించనున్నారని కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ పార్వతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్న పరీక్షలకు 4174 మంది హాజరుకానున్నారని చెప్పారు. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని ఆధార్ కార్డుతో గంట ముందే చేరుకోవాలని కోరారు. వివరాలకు 93460 22106 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఫైళ్ల పరిష్కారంలో జిల్లాకు ద్వితీయ స్థానం
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లను వేగంగా పరిష్కరించడంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ద్వితీయ స్థానంలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్లను త్వరగా పరిష్కరించడంలో కలెక్టర్ల పనితీరుకు ర్యాంకులను సీఎం చంద్రబాబు బుధవారం ప్రకటించారు. గడిచిన మూడు నెలల్లో వివిధ శాఖల నుంచి 682 ఫైళ్లు రాగా, ఇందులో 628ను క్లియర్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.


