గంజాయి డబ్బుతోనే కార్పొరేటర్ల కొనుగోలు
● కోటంరెడ్డి సోదరుల
అక్రమాలపై విచారణ జరపాలి
● మేయర్ భర్త జయవర్ధన్
నెల్లూరు రూరల్: గంజాయి డబ్బుతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్నారని మేయర్ స్రవంతి భర్త పొట్లూరి జయవర్ధన్ ఆరోపించారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అక్రమాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు ఎన్ని కోట్లిచ్చి టీడీపీలో చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక సామాన్య గిరిజన బిడ్డ మేయర్‌గా ఉంటే, ఆమెను పీఠం నుంచి దింపేందుకు కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరు కార్పొరేటర్లను రహస్య స్థావరాలకు తరలించి.. విమానాల్లో తిప్పుతూ రూ.కోట్లను వెచ్చిస్తున్నారని, దీని వెనుక గంజాయి మాఫియా డాన్ ఉన్న విషయం వాస్తవం కాదానని ప్రశ్నించారు. నెల్లూరులో ఓ వ్యక్తి ఇన్‌చార్జి మేయర్ కుర్చీ కోసం నాలుగేళ్లుగా ఎక్కని గడప.. తిరగని ఇల్లు లేదని విమర్శించారు. ఈ అవకాశం కల్పిస్తామని రూ.రెండు కోట్లను వసూలు చేసింది గంజాయి మాఫియా డాన్ కాదానని ప్రశ్నించారు.
రాజకీయ భిక్ష పెట్టిందెవరు..?
తన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది నేనేనంటూ పెద్ద మనిషి పదేపదే చెప్తున్నారని, అయితే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతోనే స్రవంతికి మేయర్ పీఠం దక్కిందని చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న స్నేహితులను సైతం మోసం చేసిన ఘనుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అని మండిపడ్డారు.
ఇన్ని ఆస్తులెక్కడివి..?
పాల డబ్బాకు వంద రూపాయల్లేవని చెప్పుకొన్న నువ్వు ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావో ప్రజలకు చెప్పాలని కోటంరెడ్డిని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్‌లో ప్రభుత్వ భూములు, గంజాయితో వచ్చిన డబ్బులతో మాగుంట లేఅవుట్లో రూ.20 కోట్లతో ఇల్లు.. హైదరాబాద్‌లో రూ.30 కోట్లతో విల్లా.. బెంగళూరులో రూ.100 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ కొనింది వాస్తవం కాదానని ప్రశ్నించారు. ఇసుక మాఫియా ద్వారా వచ్చిన రూ.30 కోట్లతో డైమండ్లు, బంగారం సంపాదించింది నిజం కాదానన్నారు. ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి రూ.వందల కోట్లతో ఇల్లు కడుతున్నారని, ఈ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వీరి అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు.


