విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
● చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలు
నెల్లూరు (టౌన్): విద్యతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ‘విలువల విద్యా సదస్సు’ను పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు హాజరై ప్రవచనలు చేశారు. తొలుత సరస్వతీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సనాతన ధర్మాలతో పాటు తల్లిదండ్రులు, గురువులపై నైతిక విలువలు తెలియజేసే అవగాహన విద్యార్థులకు అవసరమని చెప్పారు. అనంతరం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలను నెల్లూరులో నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు పద్యాలతో పుస్తకాన్ని రూపొందించారని వివరించారు.
విద్యార్థుల సందేహాల నివృత్తి
సదస్సులో దాదాపు 45 నిమిషాల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలు చేశారు. విద్యార్థులు నవ్యశ్రీ, సందీప్, మేఘన, ఆస్మిన్, ధనలక్ష్మి నిఖిల్ అడిగిన ప్రశ్నలు, సందేహాలను అర్థమయ్యేలా నివృత్తి చేశారు. అనంతరం ఆయన్ను సత్కరించారు. సమగ్రశిక్ష ఏఎస్పీడీ రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.


