అందరూ ఉన్న అనాథ ‘పెద్దిరెడ్డి’
కన్నబిడ్డల ఆదరణ కరువు
● భార్య మరణంతో కష్టాలు ఆరంభం
● ఇల్లు అమ్ముకున్న కొడుకు..
వీధిన పడిన పెద్దాయన
ఉదయగిరి: ఈ పెద్దాయన పేరు బిజ్జం పెద్దిరెడ్డి. వయసు 75 ఏళ్లు. ఒకప్పుడు బాగా బతికాడు. నలుగురు సంతానంలో ఇద్దరు బిడ్డలు చిన్నతనంలోనే చనిపోయారు. ప్రస్తుతం కొడుకు, కూతురున్నారు. భార్య మృతిచెందారు. వృద్ధుడిని బిడ్డలు పట్టించుకోలేదు. దీంతో కలిగిరిలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో తలదాచుకుంటున్నాడు. బిడ్డలిద్దరూ ఆర్థికంగా ఉన్నవారే. కానీ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, దోమల దెబ్బకు తల్లడిల్లుతూ అనాథగా మారాడు.
కలిగిరికి చెందిన పెద్దిరెడ్డి కష్టపడి పనిచేసి బిడ్డలను చదివించాడు. కొడుకు పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. కూతురికి వివాహమైంది. కలిగిరిలో ఉంటున్నారు. భార్య ఉన్నంత కాలం పెద్దిరెడ్డికి ఇబ్బంది లేదు. కానీ ఆరునెలల క్రితం ఆమె చనిపోవడంతో కష్టాలు మొదలైనట్లు చెబుతున్నాడు. ఉన్న ఇంటిని కొడుకు అమ్మేసి వెళ్లిపోయాడు. ఓ అనాథాశ్రమంలో తండ్రిని చేర్చగా అక్కడ ఉండలేక సొంతూరికి వచ్చేశాడు. ఇక్కడ ఉండేందుకు ఆవాసం లేదు. కూతురు చేరదీయలేదు. దీంతో పెద్దిరెడ్డి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఉంటూ నరకయాతన పడుతున్నాడు. తనకు వచ్చే పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నాడు. కూతురు అప్పుడప్పుడూ అన్నం పెడుతుందని చెబుతున్నాడు. తనకు దయనీయ పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.


