సమస్యల జాతర
నెల్లూరు (అర్బన్): జిల్లాకే రెఫరల్ ఆస్పత్రిగా ఉన్న దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనేలా తయారైంది . 750 పడకలున్న పెద్దాస్పత్రికి అసౌకర్యాల సుస్తీ చేసింది. నిధులున్నా రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పాలనాధికారి పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
స్పెషలిస్టు డాక్టర్లున్నా..
నగరంలో బోధనాస్పత్రిగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నైపుణ్యం కలిగిన స్పెషలిస్టు వైద్యులున్నారు. అన్ని రకాల సాధారణ వైద్యసేవలతో పాటు ఈఎన్‌టీ, పల్మనాలజీ, సైకియాట్రీ, సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనిక్, పురిటి పిల్లలు, న్యూరాలజీ, యూరాలజీ, కేన్సర్, గుండె తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన భవనాలు, విశాలమైన వార్డులున్నాయి. ఆధునిక మాడ్యులేటర్ ఆపరేషన్ థియేటర్లున్నాయి. రోజూ సరాసరిన ఓపీ 1,200 నుంచి 1,400 వరకు, ఇన్‌పేషెంట్లు 500 మంది వరకు ఉంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉరుస్తున్న ఓపీ గదులు
గైనకాలజీ విభాగం వద్ద ఓపీ రోగుల కోసం మూడు నెలల క్రితం రూ.19 లక్షలు ఖర్చు చేసి రేకులతో రెండు గదులు నిర్మించారు. అయితే ఈ నిర్మాణంలో ఎంత కమీషన్లు తిన్నారో తెలియదు గానీ చినుకు పడితే చాలు ఉరుస్తున్నాయి. దీంతో వర్షాలు పడే సమయంలో డాక్టర్లు బయటకు వచ్చేస్తున్నారు.
ఉక్కపోతలో ఆపరేషన్లు
పెద్దాస్పత్రిలో అధునాతన మాడ్యులేట్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించారు. అందులో ఏసీలు చాలా కాలంగా పని చేయడం లేదు. దీంతో డాక్టర్లు ఉక్కపోత మధ్యనే ఆపరేషన్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా ఆగిపోతే నరకం చూస్తున్నారు.
రోగులకు ఇక్కట్లు
ఆస్పత్రిలో నడవలేని రోగులు వైద్యం కోసం వస్తే వీల్‌చైర్ దొరకడం గగనమవుతోంది. ఒక్కోదఫా గంటకు పైగా వెతికి స్టాఫ్‌ను బతిమాలాడుకుంటే తప్ప వీల్‌చైర్ దొరకడం లేదు. స్ట్రెచర్లదీ అదే పరిస్థితి. ఓ వైపు వీల్‌చైర్లు, స్ట్రెచర్ల కొరత వెంటాడుతుంటే ఉన్న వాటిని పలువురు సిబ్బంది ఆస్పత్రి దుప్పట్లు, రికార్డులు, ఇతర పనులకు వినియోగిస్తున్నారు.
అవుట్ సోర్సింగ్ సిబ్బంది కారణంగా..
ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ స్టాఫ్‌ను కాదని అవుట్ సోర్సింగ్ విభాగం వారిని నియమించారు. దీంతో పనులు సక్రమంగా జరగడం లేదు. పలు బిల్లులు ఆగిపోతున్నాయి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, మెడికల్ బోర్డుకు వచ్చే కేసుల రికార్డులు సకాలంలో పంపాలంటే సదరు సిబ్బంది భారీ స్థాయిలో లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆరునెలల క్రితం ఓ మహిళా చిరుద్యోగి అనారోగ్యంతో తాను ఉద్యోగం చేసే స్థితిలో లేనందున సర్టిఫికెట్ ఇవ్వాలని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంది. అలా సర్టిఫికెట్ ఇస్తే తనను అన్‌ఫిట్‌గా భావించి బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆమె ఆశ పడింది. అధికార పార్టీకి చెందిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కూడా సిఫార్సు చేయించింది. అయినప్పటికీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆ ఫైల్‌ను కదిలించేందుకు రూ.70 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆమె చేసేదేమీ లేక డబ్బులిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులురెడ్డి అప్పటి సూపరింటెండెంట్ సిద్ధానాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తిరిగి నగదును బాధితురాలికి ఇచ్చారు. రెగ్యులర్ సిబ్బందిని కాదని అలాంటి వారిని కీలక పోస్టుల్లో నియమించడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొత్త సూపరింటెండెంట్ వచ్చినప్పటికీ లోపాలు సరిచేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలని రోగులు కోరుతున్నారు.
ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. ఒకటో నంబర్ వద్ద వందలాది మంది ఓపీలు తీసుకుంటారు. దాని పక్కనే మరుగుదొడ్డి ఉంది. అందులో మొదట పురుషులు, ఆ తరువాత సీ్త్రలకు గదులున్నాయి. అయితే రెండింటికీ ఒకే ద్వారం ఉండటంతో సీ్త్రలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక రోగి కాపలా ఉంటే మరొకరు లోపలకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్క మహిళే వచ్చినప్పుడు వారి బాధ వర్ణనాతీతం. మరోవైపు బాత్‌రూములను ఉదయం ఒక్కసారే శుభ్రం చేస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. వందలాది మంది వినియోగిస్తుండడంతో ఓపీ వరకు దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే వార్డుల్లోని మరుగుదొడ్లను సక్రమంగా శుభ్రం చేయకపోతుండడంతో దుర్వాసనను భరించలేక రోగులు వైద్యం వద్దు దేవుడా అటూ డిశ్చార్జి చేయించుకుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి అనుభవం ఏకంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సభ్యుడి భార్యకే ఎదురైంది. అయినా హెచ్‌డీఎస్ కమిటీ సభ్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు.
సూపరింటెండెంట్
దృష్టికి తీసుకెళ్లాం
ఆస్పత్రిలో బాత్‌రూములు, లిఫ్ట్‌లు, అడ్మినిస్ట్రేషన్‌లో జరిగే లోపాలను సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి దృష్టికి తీసుకెళ్లాం. ఆమె సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. మిగతా వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.
–మడపర్తి శ్రీనివాసులు,
పెద్దాస్పత్రి అభివృద్ధి కమిటీ కో ఆర్డినేటర్
ఓపీ వద్ద సీ్త్ర, పురుషులకు ఒకే బాత్‌రూమ్
పని చేయని లిఫ్ట్‌లు
ఏసీల్లేక ఉక్కపోతలో ఆపరేషన్లు
చేస్తున్న వైద్యులు
రూ.19 లక్షలతో ఎంసీహెచ్ మహిళా
ఓపీ గదుల నిర్మాణం
మూడు నెలలకే ఉరుస్తున్న వైనం
పట్టించుకోని అధికారులు
సమస్యల జాతర
సమస్యల జాతర
సమస్యల జాతర
సమస్యల జాతర


