జిల్లాల మధ్య జల వివాదం తీసుకురావొద్దు
● సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘జిల్లాల విభజనతో జల వివాదం తీసుకురావొద్దు. ఇక్కడి పలు ప్రాంతాలను తిరుపతి జిల్లాలో కలిపేందుకు చేస్తున్న ప్రక్రియను వెంటనే ఆపివేయాలి’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు. నెల్లూరులోని బాలాజీ నగర్‌లో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. శ్రీహరికోట, శ్రీసిటీ, సిలికా, మైకా గనులు తిరుపతి జిల్లాకు వెళ్లిపోవడం జరిగిందన్నారు. కండలేరు జలాశయాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే జల వివాదాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను గూడూరు రెవెన్యూ డివిజన్‌లో కలిపే ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు. గూడూరును నెల్లూరు జిల్లాలో ఉంచాలని ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెకంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, సీఐటీయూ నాయకురాలు రెహానా బేగం పాల్గొన్నారు.


