నాలుగు కేజీల గంజాయి స్వాధీనం
● నలుగురు రౌడీషీటర్ల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. మాగుంటలేఅవుట్ రైల్వేట్రాక్ వద్ద, జీజీహెచ్ సమీపంలో గంజాయిని విక్రయించేందుకు తరలిస్తున్న నలుగురు రౌడీషీటర్లను దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు కేజీల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ బీ కళ్యాణరాజు మీడియాకు వెల్లడించారు. టెక్కెమిట్టకు చెందిన ఎం ప్రవీణ్, లేక్‌వ్యూకాలనీకి చెందిన జే మహేష్, సారాయంగడి సెంటర్‌కు చెందిన షేక్ ముక్తియార్, షేక్ అబ్దుల్ మజీద్‌పై దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. వ్యసనాలకు బానిసైన వీరు ఈజీ మనీకోసం గంజాయి విక్రయాలకు తెరలేపారు. దీనిపై దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ కళ్యాణరాజుకు పక్కా సమాచారం అందింది. ఆదివారం రాత్రి ఆయన తన సిబ్బందితో కలిసి మాగుంటలేఅవుట్ రైల్వే ట్రాక్ సమీపంలో మహేష్, ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీజీహెచ్ వద్ద ముక్తియార్, అబ్దుల్ మజీద్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద మరో రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించేందకు వెళ్తున్నామని వెల్లడించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ముక్తియార్‌పై మర్డర్ కేసు ఉందన్నారు. ఎక్కడైనా గంజాయి రవాణా, విక్రయాలు, నిల్వ, సేవనం వంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే 94407 96308 లేదా డయల్ 112కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


