హద్దు మీరితే కఠిన చర్యలు
● రోడ్లపై నిందితులను నడిపించిన పోలీసులు
నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు. బస్సు డ్రైవర్ మన్సూర్, సలాంపై బ్లేడ్‌లతో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సోమవారం రాత్రి సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గాంధీబొమ్మ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు రోడ్డుపై నడిపించారు. ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య వివరాలను వెల్లడించారు. వేదాయపాళెం గాంధీనగర్‌కు చెందిన మన్సూర్, ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన సలాం ఎస్‌ఎఎస్ ప్రైవేట్ సిటీ బస్సులో డ్రైవర్, కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం బస్సు బోసుబొమ్మ వైపు వెళ్తుండగా.. మద్యం మత్తులో యువకులు బాబు ఐస్‌క్రీమ్ వద్ద రోడ్డుపై అడ్డంగా బైక్ పార్క్ చేసి మాట్లాడుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించారు. డ్రైవర్ హారన్ కొట్టి అడ్డు తొలగాలని చెప్పారు. దీంతో వారు డ్రైవర్, కండక్టర్లపై దాడి చేయగా వారిద్దరూ బైక్ తాళం తీసుకెళ్లారు. నిందితులు బస్సును వెంబడించి బోసుబొ మ్మ వద్ద అడ్డుకుని బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు.. బాధితుల ఫిర్యాదుపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు సంతపేట గోపిటీ సెంటర్‌కు చెందిన మదన్ అలియాస్ బాబీ, శ్రీకాంత్, సంతపేట ప్రాంతానికి చెందిన అజయ్, నితిన్, తేజగా గుర్తించి సోమవారం రాత్రి తిక్కనపార్కు సమీపంలోని శివాలయం వద్ద అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్‌లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


